డార్క్ కామెడీతో ‘గుర్రం పాపిరెడ్డి’ చిత్రాన్ని తీశామని, కంటెంట్ మీద నమ్మకంతో 140 స్క్రీన్లలో విడుదల చేస్తున్నామని చెప్పారు చిత్ర నిర్మాతలు జయకాంత్ (బాబీ), అమర్ బురా. నరేష్ ఆగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా మురళీ మనోహర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడారు.
జయకాంత్ (బాబీ) మాట్లాడుతూ ‘డార్క్ కామెడీ జోనర్లో విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఫరియా అబ్దుల్లాకు మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. ఇందులో ఆమె సౌధామినిగా విభిన్నమైన పాత్రలో కనిపిస్తుంది. బ్రహ్మానందం, యోగిబాబు పాత్రలు కావాల్సినంత వినోదాన్ని పండిస్తాయి’ అన్నారు.
తెలివిలేని వాళ్లు తెలివైన వాడిని ఎలా ఎదుర్కొన్నారన్నదే సినిమా కథాంశమని మరో నిర్మాత అమర్ బురా తెలిపారు. ఇందులో ఎలాంటి సందేశాలు ఉండవని, ప్రేక్షకుల్ని రెండున్నర గంటల పాటు మనసారా నవ్వించాలనే లక్ష్యంతో సినిమా చేశామని, టికెట్ రేటు కూడా అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నామని అమర్ బురా పేర్కొన్నారు.