హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): బీసీల అస్తిత్వంతో చెలగాటమాడిన ఏ ప్రభుత్వానికీ మనుగడ ఉండదని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల భావోద్వేగాలతో చెలగాటమాడుతున్నని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ధ్వజమెత్తారు. బీసీల భావోద్వేగం భాస్వరం వంటిదని, అది భగ్గుమంటుందని అన్నారు. సాయిఈశ్వరాచారి బలిదానంతో బీసీలలో భావోద్వేగాలు అంతకంతకు పెరిగిపోతున్నాయని, ఆ జ్వాలలు ప్రతి బీసీ గుండెను తాకుతున్నాయని పేర్కొన్నారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆ యన మీడియాతో మాట్లాడారు. తనలాంటి వాళ్లు పేదరికం నుంచి బయట పడాలని, బీసీలకు ఆర్థిక, రాజకీయ సామాజిక న్యాయం అందాలన్న ఉద్దేశంతోనే సాయిఈశ్వరాచారి ఆత్మహుతికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తంచేశారు.
ఆయన మరణం ముమ్మాటికీ సర్కారు హత్యేనని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు లభిస్తే, వారి జీవితాల్లో మార్పు వస్తుందని ఈశ్వరాచారి కోరుకున్నాడని తెలిపారు. చారి ఆత్మహత్యకు కాం గ్రెస్ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి, ఆయన కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఈ విషయంపై నోరు తెరువకపోవడం బాధాకరమని బీసీ సమాజం ఆవేదన వ్యక్తం చేస్తున్నదని తెలిపారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చూసి, బీసీలంతా కాంగ్రెస్‌ను గెలిపించారని, తీరా గెలిచిన తర్వాత వారి ఆశలను అడియాశలు చేశారని విమర్శించారు.
బీసీలను మోసం చేస్తూ ఇంకెంతకాలం పరిపాలన చేస్తారని, ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధిచెప్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మాతృ సంఘం అధ్యక్షుడు వేములవాడ మదన్మోహన్రావు, ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి రాపోలు సుదర్శన్, కవి లక్ష్మణ్‌గౌడ్, రచయిత ఎండీ జలాలుద్దీన్, బైరోజు రవీంద్రాచారి, క్షీరసాగరం ప్రసాద్, బెజ్జారపు రామ్మోహన్, కందుకూరి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.