సిటీబ్యూరో, మార్చి 8(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మద్యంతాగి రోడ్డుపైకి వస్తున్నవారు వాహనాలు నడుపుతున్న క్రమంలో పోలీసుల తనిఖీల్లో పలువురు పట్టుబడుతున్నారు. పగలంతా పనులతో పొం దిన అలసట, కార్యాలయంలో ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం కొందరు మద్యం తాగుతుండగా, మరికొందరు సరదాలు, వేడుకల పేరిట, ఇంకొందరు మత్తుకు బానిసై తాగుతున్నారు.
మద్యం సేవించిన తర్వాత డ్రైవింగ్ చేయకూడదని తెలిసీ వెనక్కు తగ్గడం లేదు. జరిమానాలతో బయటపడవచ్చని వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. గత 14నెలలల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారికి రూ.14 కోట్ల జరిమానా విధించగా, 548 మంది జైలుపాలయ్యారని పోలీసులు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిలో ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను వారి పైఅధికారులకు పోలీసులు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడగా, నలుగురి ప్రైవేటు ఉద్యోగుల జాబ్స్ పోయినట్లు తెలిసింది.
నగరంలో జనవరి 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు మందుబాబులు ఎక్కువగా పట్టుబడిన ప్రాంతాల్లో ఎస్సార్‌నగర్ ముందంజలో ఉండగా, మలక్‌పేట, కాచిగూడ, జూబ్లీహిల్స్, చిలకలగూడ, సుల్తాన్‌బజార్, సైఫాబాద్ తర్వా తి స్థానాల్లో ఉన్నాయి. మొత్తం ఈ ప్రాంతాల్లో 19,499 కేసులు నమోదయినట్లు పోలీసులు చెప్పారు. ఎస్సార్‌నగర్‌లో 3,627 కేసులు నమోదవగా, 108 మందికి జైలుశిక్షలు పడితే రూ.88,63,200 జరిమానా విధించారు.
మ ద్యం తాగి పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు కొత్త మార్గాల్లో వెళ్తున్న మం దుబాబులు మైకంలో దారులు మరిచి మళ్లీ పట్టుబడుతున్నారు. కొందరు మందుబాబులు వింతగా ప్రవర్తిస్తున్నారని , ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, భార్యతో గొడవలు, అయినవారు మరణించారన్న బాధతో తాగుతున్నామని చెబుతున్నారని ఓ పోలీస్ అధికా రి చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారు కొంద రు పోలీసులతో వాగ్వాదానికి దిగుతుండగా ఇంకొందరు పోలీసులనే ఢీకొట్టి పారిపోతున్నారు. ఇలాంటి వారిపై విధి నిర్వహణకు ఆటంకం కలిగించడం, హ త్యాయత్నం వంటి కేసులు నమోదయ్యాయి.
రెండురోజుల్లో 445 మందిపై కేసులు
నగరంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నవారిపై సిటీ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో ప్రతీవారం మాదిరిగానే మార్చి 6,7 తేదీల్లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిర్వహించారు. నగరవ్యాప్తంగా చేపట్టిన ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 445 మంది వాహనదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడినవారిలో ద్విచక్రవాహనదారులు 377 మంది, ఆటోరిక్షాలు 27 మంది, కార్లు ,ఇతర భారీ వాహనాలు నడుపుతున్నవారు 46 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు.