న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్(Jantar Mantar) వేదికగా ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ ధర్నా వేదికను మరో ప్రాంతానికి మార్చాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఇవాళ పిల్ దాఖలైంది. ఆ పిల్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఆమోదం వ్యక్తం చేసింది. నిరసన ప్రదర్శనల కోసం జంతర్ మంతర్ సరైన వేదిక కాదు అని దాఖలైన పిటీషన్ అంశంలో కేంద్రంతో చర్చించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతాకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సతీష్ చాంద్ కౌశిక్ ఆ పిటీషన్ దాఖలు చేశారు. జంతర్ మంతర్ లొకేషన్లో సీవేజ్, ఫుడ్, ఇతర వసతుల సదుపాయం ఏమాత్రం లేవని పిల్లో పేర్కొన్నారు.
దేశ రాజధానిలోని మరో ప్రదేశంలో ధర్నాలు నిర్వహించేందుకు వేదికను ఏర్పాటు చేయాలని, దాని కోసం స్థలం కేటాయించాలన్న ఉద్దేశాన్ని కూడా పిల్లో వ్యక్తం చేశారు. జంతర్ మంతర్‌లో జరుగుతున్న ఆందోళనల వల్ల స్థానికులకు ఇబ్బందులు కలుగుతున్నట్లు పిల్లో తెలిపారు. నిత్యావసర సేవలకు కూడా అంతరాయం కలుగుతోందన్నారు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, వీ మోహనతో కూడిన ధర్మాసనం ఈ పిల్‌పై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. పిల్లో లేవనెత్తిన అంశాలు ముఖ్యమైనవే అని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు.
జంతర్ మంతర్ వద్ద మెడికల్ నిత్యావసరాలను సరఫరా చేయడం కూడా ఇబ్బందే అవుతోందన్నారు. రాజకీయ ర్యాలీలతో స్థానికులకు సమస్యలు ఎదురవుతున్నాయని. జూలై 20వ తేదీ నాటి ఘటన మళ్లీ జరగకుండా చూడాలని పిల్లో పిటీషనర్ కోరారు.