Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10 సీజన్లో తొలి వారం అనూహ్య పరిణామాలతో ముగిసింది. సాధారణ సీజన్లకు భిన్నంగా మొదటి వారంలోనే చరణ్ మహాదేవ్, చైత్ర రాయ్‌లను ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. దీంతో ఈసారి సీజన్లో ఏ క్షణంలో ఏ ట్విస్ట్ వస్తుందోననే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ఇక వారాంతపు ఎపిసోడ్లో నాగార్జున తనదైన శైలిలో కంటెస్టెంట్ల ఆటతీరును విశ్లేషించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్‌ను వినాయకచవితి ప్రత్యేక పాటతో నాగార్జున ప్రారంభించారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైకి వచ్చిన ఆయన.. కాసేపు ప్రేక్షకులతో ముచ్చటించి, అనంతరం నేరుగా బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లారు. ఇంట్లోకి వెళ్లిన వెంటనే కంటెస్టెంట్ల ఆటపై దృష్టి పెట్టిన నాగార్జున.. కొందరి ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
హౌస్‌లో రోహిత్, శాలినీ, సృష్టి ఎక్కువగా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారని నాగార్జున గుర్తించారు. బిగ్ బాస్ ఇంట్లో తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సిన అవసరం ఉందంటూ వారికి సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత అమన్‌ను హౌస్‌మేట్‌గా ప్రకటించారు. దీంతో హౌస్‌లో సేఫ్ అవుతున్న కంటెస్టెంట్ల సంఖ్య క్రమంగా పెరిగింది. ఇక గత ఎపిసోడ్లో ప్రారంభమైన ‘హార్ట్‌కు ఎవరు దగ్గర? ఎవరు దూరం?’ అనే ఆటను కొనసాగించారు. ఒక్కొక్కరుగా కంటెస్టెంట్లు తమకు ఎవరంటే ఇష్టం, ఎవరితో దూరంగా ఉంటారో కారణాలతో సహా వివరించారు. అమన్.. దేబ్జానీ తన హార్ట్‌కు దగ్గరగా, రామ్ ప్రసాద్ దూరంగా ఉన్నారని చెప్పడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. రామ్ ప్రసాద్ మాత్రం దేబ్జానీని దగ్గరగా, శాలినీని దూరంగా ఉంచాడు. కృష్ణుడు తనకు దేబ్జానీ దగ్గరగా ఉంటుందని, రోహిత్ దూరంగా ఉంటాడని చెప్పాడు. ముకేశ్.. ఝాన్సీని దగ్గరగా, రోహిత్‌ను దూరంగా పెట్టాడు. నరేష్.. దేబ్జానీ దగ్గరగా, సృష్టి దూరంగా ఉందని చెప్పాడు.
శాలినీ.. రామ్ ప్రసాద్ తనకు దగ్గరగా, అమన్ దూరంగా ఉన్నాడని చెప్పగా.. సుధీర్ ముకేశ్ దగ్గరగా, వర్షిణి దూరంగా ఉందని పేర్కొన్నాడు. వంశీ మాత్రం రోహిత్‌ను దగ్గరగా, సుధీర్‌ను దూరంగా పెట్టాడు. ఎక్కువ మంది కంటెస్టెంట్లు దేబ్జానీని హార్ట్‌కు దగ్గరగా పెట్టుకోవడంతో నాగార్జున ఆమెను అభినందించారు. అదే సమయంలో రోహిత్‌ను పలువురు దూరంగా పేర్కొనడాన్ని ఆయన గమనించారు. ఇది తనకు ఒక హెచ్చరిక లాంటిదని, ఇకపై ఆటతీరును మార్చుకోవాలని రోహిత్‌కు నాగార్జున సూచించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ముకేశ్ కూడా హౌస్‌మేట్‌గా ఎంపికయ్యాడు.ఎపిసోడ్లో అత్యంత ఆసక్తికరమైన అంశాల్లో ‘బ్లాక్ కీ’ పవర్ ఒకటి. హౌస్‌లోకి వచ్చినప్పుడు పది మంది కంటెస్టెంట్లు ప్రత్యేక పవర్స్ గెలుచుకున్నారు. అందులో ఒక పవర్‌ను ఇప్పటికే శాలినీ ఉపయోగించుకుంది. మిగిలిన తొమ్మిది మందిలో ఎవరి పవర్‌ను మరొకరికి బదిలీ చేయాలనే నిర్ణయాన్ని కంటెస్టెంట్లకే అప్పగించారు. ఈ క్రమంలో పలువురు వేర్వేరు పేర్లు సూచించారు. చివరకు అత్యధిక మంది సృష్టి పేరును చెప్పడంతో బ్లాక్ కీ ఆమెకు దక్కింది.
అయితే బ్లాక్ కీ ద్వారా వచ్చిన అసలు పవర్‌ను వెంటనే కాకుండా తర్వాత వెల్లడిస్తామని నాగార్జున చెప్పారు. పవర్ బాక్స్ లేని నలుగురు కంటెస్టెంట్లకు మరో చిన్న పోటీ నిర్వహించారు. అందులో సుధీర్ విజయం సాధించాడు. దీంతో సృష్టి వద్ద ఉన్న పవర్ బాక్స్ సుధీర్‌కు వెళ్లింది. ఇలా ఒకరి పవర్ మరొకరికి మారడంతో బిగ్ బాస్ ఇంట్లో సమీకరణాలు కూడా మారే అవకాశం కనిపించింది. తర్వాత సృష్టి, నరేష్‌లను హౌస్‌మేట్స్‌గా ప్రకటించారు. అనంతరం నరేష్‌కు కంటెస్టెంట్లను రెండు టీమ్‌లుగా విభజించే బాధ్యత ఇచ్చారు. అయితే సాధారణంగా విడదీయకుండా అందరినీ కలిపేలా, ‘అగ్నిపరీక్ష’ నుంచి వచ్చినవారు, సెలబ్రిటీలు, ఒకరితో ఒకరికి గొడవలు ఉన్నవారు ఇలా మిక్స్ అయ్యేలా టీమ్‌లను ఏర్పాటు చేశాడు. ఎపిసోడ్ చివర్లో వర్షిణి, సుధీర్, కృష్ణుడిని యాక్టివిటీ రూమ్‌కు పిలిపించారు. దీంతో వారిలో ఎవరు హౌస్‌ను వీడతారనే ఉత్కంఠ ఏర్పడింది. కానీ చివరికి ముగ్గురినీ హౌస్‌మేట్స్‌గా ప్రకటించి బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో తొలి వారం పూర్తయ్యే సమయానికి ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లందరూ హౌస్‌మేట్స్‌గా మారిపోయారు. దశావతారం కాన్సెప్ట్‌లో భాగంగా మొదటి వారానికి సంబంధించిన ‘మహాపరిక్ష’ ముగిసిందని నాగార్జున ప్రకటించారు. ఇక రెండో వారంలో ‘పవర్ ఆఫ్ పీపుల్’ అనే కొత్త దశ ప్రారంభం కానుంది.