పాట్నా: బీహార్‌లోని బీజేపీ కంచుకోట అయిన బంకీపూర్ ఉపఎన్నిక కౌంటింగ్‌లో జన్ సూరజ్ పార్టీ (జేఎస్పీ) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ లీడ్‌లో ఉన్నారు. 14 రౌండ్ల లెక్కింపు తర్వాత 8,000కుపైగా ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. (Prashant Kishor) ప్రశాంత్ కిషోర్‌కు ఇప్పటి వరకు 28,201 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా 20,420 ఓట్లు సాధించారు. ఆర్జేడీ అభ్యర్థి రేఖా గుప్తా 6,142 ఓట్లతో చాలా వెనుకబడి మూడో స్థానంలో ఉన్నారు.
కాగా, ఏప్రిల్‌లో రాజ్యసభకు ఎన్నికైన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజీనామా చేయడంతో బంకీపూర్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 26 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక పోటీ విజేతను నిర్ణయించడానికి మొత్తం 31 రౌండ్లు కౌంటింగ్ జరుగనున్నది.
అయితే 1995 నుంచి బీజేపీ కంచుకోటగా ఉన్న బంకీపూర్ నియోజకవర్గం ఉప ఎన్నికలో తొలిసారి పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. దీంతో ఆయన పూర్తిస్థాయి రాజకీయ ఆరంగ్రేటానికి ఈ ఎన్నిక కీలక మలుపు కానున్నది.