Irumudi | మాస్ మహారాజా రవితేజ హీరోగా, కుటుంబ కథా చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇరుముడి’ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్లను మేకర్స్ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో చిత్రం నుంచి రెండో సింగిల్ ‘యాలాలో యాలాలో.. వెన్నెల్లో ఎన్నెన్ని ముచ్చట్లో..’ అనే మధురమైన ఫ్యామిలీ మెలోడీని విడుదల చేశారు. కుటుంబ బంధాలు, ఆప్యాయత, భావోద్వేగాలను ప్రతిబింబించేలా రూపొందిన ఈ పాట తొలి వినికిడిలోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ హృదయాన్ని హత్తుకునే సాహిత్యం అందించగా, సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ తన మెలోడీ స్వరాలతో పాటను మరింత అందంగా తీర్చిదిద్దారు. విడుదల చేసిన పోస్టర్లో రవితేజ తన కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా కనిపించడం సినిమా భావోద్వేగ నేపథ్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఇప్పటికే విడుదలైన తొలి పాట ‘ఇరుముడి కట్టు’ భక్తి గీతంగా మంచి ఆదరణ పొందింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచిన ఆ పాట తర్వాత ఇప్పుడు ‘యాలాలో యాలాలో’తో సినిమా మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ‘ఇరుముడి’లో రవితేజ ఇప్పటివరకు చేయని ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని చిత్రబృందం చెబుతోంది. తండ్రీ–కూతుళ్ల అనుబంధాన్ని ప్రధానాంశంగా తీసుకున్న ఈ కథలో అయ్యప్ప స్వామి దీక్షకు కూడా కీలక ప్రాధాన్యం ఉంది.
తన కూతురి కోసం జీవితాన్ని మార్చుకునే ఓ తండ్రి ప్రయాణాన్ని భావోద్వేగభరితంగా చూపించనున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో సినిమా విడుదల తేదీపై వస్తున్న ఊహాగానాలకు కూడా మేకర్స్ తెరదించారు. ముందుగా ప్రకటించినట్లుగానే ఆగస్టు 21న ‘ఇరుముడి’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని అధికారికంగా స్పష్టం చేశారు. కుటుంబ అనుబంధాలు, ఆధ్యాత్మికత, మాస్ యాక్షన్ అంశాల సమ్మేళనంగా రూపొందుతున్న ‘ఇరుముడి’ రవితేజ కెరీర్లో మరో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందనే నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.