– కొత్తగూడెం ఏరియా నూతన జీఎం సి.హెచ్.వెంకటరమణ
– పీవీకే-5 ఇంక్లైన్ ఉద్యోగులతో పరిచయ సమావేశం
రుద్రంపూర్, ఆగస్టు 03 : సింగరేణి కొత్తగూడెం ఏరియా నూతన జనరల్ మేనేజర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సి.హెచ్.వెంకటరమణ సోమవారం తొలి షిఫ్ట్‌లో పీవీకే నెం.5 ఇంక్లైన్ గనిని సందర్శించి ఉద్యోగులు, అధికారులతో పరిచయ సమావేశం నిర్వహించారు. ముందుగా పీవీకే గని ఆవరణలోని అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం గని అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమై గని నిర్వహణ, ఉత్పత్తి లక్ష్యాలు, భద్రతా ప్రమాణాలు, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి ఉద్యోగి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రమాద రహిత వాతావరణంలో విధులు నిర్వహించాలని సూచించారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనతో పాటు సింగరేణి ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అధికారులు, ఉద్యోగులు ఒక జట్టుగా సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగుల సంక్షేమం, పని పరిస్థితుల మెరుగుదల, సమస్యల పరిష్కారంలో యాజమాన్యం ఎల్లప్పుడూ సానుకూలంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఉద్యోగుల సూచనలు, సలహాలకు ప్రాధాన్యం ఇస్తూ పరస్పర సమన్వయంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్.ఓ. టు జీఎం ఎం. గోవిందరావు, పీవీకే ఏజెంట్ రామ్ భరోస్ మెహతో, ఏరియా ఇంజనీర్ వి.రామకృష్ణ, గ్రూప్ ఇంజనీర్ గోదావరి శ్రీనివాస్, మేనేజర్ పి.రవికిరణ్, సేఫ్టీ ఆఫీసర్ ఆర్.అనిల్ సాగర్, పిట్ ఇంజనీర్ శ్రీనివాస్, ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ భూక్య రమేష్, ఐఎన్టీయూసీ పిట్ సెక్రటరీ చిలక రాజయ్యతో పాటు అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

‘ప్రతి ఉద్యోగి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి’