వాషింగ్టన్, అక్టోబర్ 1: అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో 50 ఏండ్ల మహిళకు అమలు చేసిన మరణశిక్ష విఫలమైంది. మూడు దశాబ్దాల క్రితం తన తోటి విద్యార్థిని హత్య చేసిన కేసులో దోషిగా నిర్ధారణ అయిన క్రిస్టా పైక్కు, బుధవారం రాత్రి విషపు ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష అమలు చేసేందుకు రెండు ప్రాణాంతక ఇంజెక్షన్లు చేసినా ఆమె శ్వాస ఆగిపోలేదు. దీంతో ఆమె మరణశిక్షను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది చివరి వరకు ఆమెకు మరణ శిక్షను అమలు చేయమని అధికారులు చెప్పారు. 18 ఏండ్ల వయసున్నప్పుడు పైక్ 1995లో తన 17 ఏండ్ల ప్రియుడు టాడరిల్ షిప్, మరో వ్యక్తితో కలిసి తమతో పాటు వృత్తి విద్యా కేంద్రంలో చదువుతున్న స్లెమ్మర్ను ఒక అటవీ ప్రాంతానికి రప్పించి అక్కడ ఆమెను చిత్రహింసలకు గురిచేసి చంపినట్టు కేసు నమోదైంది. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం ఆమెకు మరణ శిక్ష పడగా, దానిని అమలు చేశారు. అయితే రెండు ప్రాణాంతక ఇంజెక్షన్లు చేసినా ఆమె శ్వాస ఆగలేదు. పైగా పెద్దగా గురకపెట్టడం ప్రారంభించడంతో ఆ ప్రక్రియను నిలిపివేశారు. వెంటనే జైలు నుంచి దవాఖానకు తరలించి చికిత్స అందజేస్తున్నారు.