చలికాలం వస్తే చాలు.. బాల్కనీలో పెరిగే కూరగాయల మొక్కలు కుచించుకు పోతాయి. సూర్యరశ్మిలేమితో ఎదుగుదలకు దూరమవుతాయి. దాంతో, వంటకు కావాల్సిన కూరగాయలు సకాలంలో చేతికి అందవు కూడా. అందుకే.. కాలానికి అనుగుణంగా ఉన్న కూరగాయలను మాత్రమే పెంచుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆకుకూరలు పెంచడం చాలా సులభం. చిన్నపాటి సంరక్షణతోనే ఆకుకూరలు సులభంగా, ఏపుగా పెరుగుతాయి. ప్రధానంగా చలికాలంలో బాలనీ గార్డెనింగ్‌తో ప్రతిరోజూ భోజనంలో తాజాదనాన్ని తీసుకురావడానికి సులభంగా పెంచగలిగే మొక్కల గురించి తెలుసుకుందాం..
పాలకూర: బాలనీ వాతావరణం పాలకూరకు అనుకూలంగా ఉంటుంది. చల్లని గాలిని ఇష్టపడుతూ ఆహ్లాదకరమైన వేగంతో పెరుగుతుంది. కాస్త విశాలంగా ఉండే కుండీలకు బాగా సరిపోతుంది. తకువ సూర్యరశ్మి మాత్రమే పడే మూలల్లో కూడా చకగా ఎదుగుతుంది. ఇది కట్-అండ్-కమ్-ఎగైన్ పద్ధతిలో.. తేలికగా కత్తిరించినా వారాల తరబడి పంటను అందిస్తూనే ఉంటుంది.
మెంతి: ఇంట్లో పెరిగే వేగవంతమైన మొక్కల్లో మెంతి ఒకటి. చాలా తకువ సమయంలోనే కుండీనంతా లేత ఆకులతో నింపేస్తుంది. దీనికి సాదాసీదా కంటైనర్ ఉంటే సరిపోతుంది. సువాసన కూడా బాలనీని చుట్టేస్తుంది. మెంతి కూర తినాలని అనిపించగానే.. దీని ఆకులను కత్తిరించుకోవచ్చు.
ముల్లంగి: ఇరుకైన ప్రదేశాల్లో కూడా ముల్లంగిని పండించొచ్చు. ఈ మొక చలికాలపు గాలిని ఇష్టపడుతుంది. కుండీలో తగినంత లోతు ఉంటే చాలు.. మంచిగా, కరకరలాడే వేర్లను ఉత్పత్తి చేస్తుంది. ఒక సాధారణ లోతైన కంటైనర్ మీకు సుమారు నాలుగు నుంచి ఆరు వారాల్లో ముల్లంగి పంటను అందిస్తుంది.
క్యారెట్లు: చిన్నగా, గుండ్రని క్యారెట్ రకాలు కుండీలకు అనుకూలంగా ఉంటాయి. ఇందుకోసం వదులుగా ఉండే మట్టితో, లోతైన కుండీని ఎంచుకోండి. మట్టి ఉపరితలం గట్టిపడకుండా చూసుకోవాలి. చలికాలపు వాతావరణం వాటిని త్వరగానే పెరిగేలా సాయపడుతుంది. స్థిరమైన తేమ, ప్రకాశవంతమైన కాంతి ఉంటే సరిపోతుంది.