టేకులపల్లి, డిసెంబర్ 12 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టిషాక్ తగిలింది. సీనియర్ నాయకుడు టేకులపల్లికి చెందిన భూక్యా దళ్‌సింగ్‌నాయక్.. తన భార్య, చుక్కలబోడు మాజీ సర్పంచ్ గంగాబాయితో కలిసి శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన టేకులపల్లి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నాలుగు దశాబ్దాలపాటు ఎంతో కష్టపడి పనిచేసినా గుర్తింపు లేదని వాపోయారు.
అదీగాక తీవ్రంగా అవమానిస్తున్నారని, ఇవన్నీ భరించలేక పార్టీని వీడుతున్నట్టు కన్నీటిపర్యంతమయ్యారు. 1987లో కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయం జీవితం ప్రారంభించినట్టు తెలిపారు.1999లో కాంగ్రెస్ తరపున ఇల్లెందు నుంచి అసెంబ్లీకి పోటీచేసినట్టు చెప్పారు. పార్టీలో తనకు విలువ ఇవ్వడం లేదని భావించి తన భార్యతో కలిసి పార్టీని వీడుతున్నట్టు పేర్కొన్నారు. కాగా భూక్యా దళ్‌సింగ్ నాయక్‌తోపాటు మరికొందరు సీనియర్ నాయకులు బీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం మండలంలో జోరుగా సాగుతున్నది.