న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: దేశీయ శ్రీమంతుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోతున్నది. 2025 సంవత్సరం అచొచ్చిన దేశీయ కుబేరులకు 2026 మాత్రం అచ్చి రావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం, ఐటీ రంగ షేర్లు కుదేలుకావడంతో భారీగా సంపద కోల్పోయారు. దేశీయ కుబేరుల్లో అగ్రగామిగా వెలుగొందుతున్న ముకేశ్ అంబానీతోపాటు మరో నలుగురు ఏకంగా 21 బిలియన్ డాలర్ల(సుమారు రూ.2 లక్షల కోట్లు) సంపద కోల్పోయారు.
వీరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 10 బిలియన్ డాలర్ల సంపద హరించుకుపోయింది. దీంతో ఆయన సంపద 97.7 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్టు బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది. చమురు నుంచి టెలికాం వరకు సేవలు అందిస్తున్న ముకేశ్ అంబానీకి చెందిన సంస్థలు నిలకడైన వృద్ధిని నమోదు చేసుకున్నప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు భారీగా పతనం చెందింది. దీంతో ఆయన సంపదను భారీగా కోల్పోయారు. భవిష్యత్తులో రిలయన్స్ లాభాలలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనే అవకాశాలున్నాయని ఈక్విరస్ క్యాపిటల్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
మరోవైపు, విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ 3.87 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోగా..హెచ్‌సీఎల్ టెక్నాలజీ చైర్మన్ శివ్ నాడర్ 2.93 బిలియన్ డాలర్ల సంపద హరించుకుపోయింది. దీంతో ప్రేమ్‌జీ సంపద 23.6 బిలియన్ డాలర్లకు పరిమితంకాగా, నాడార్ సంపద 34.6 బిలియన్ డాలర్లకు తగ్గింది. కృత్రిమ మేధస్సుకు సంబంధించి నెలకొన్న ఆందోళనలు ఐటీ రంగంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా దేశీయ ఐటీ దిగ్గజ సంస్థలైన టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీ షేర్లు 21 శాతం వరకు నష్టపోయాయి. ఏఐ నేతృత్వంలోని సాంకేతిక పరిణామం వేగం, స్థాయి ఈ సారి మునుపటి వాటితో పోలిస్తే భిన్నంగా, పెద్దదిగా ఉంటుందని ఆశిస్తున్నట్టు, అలాగే భవిష్యత్తులో ఏఐ అంతరాయం మరింత పెరిగే అవకాశాలున్నాయని పేర్కొంది.
ఐటీ షేర్లలో భారీ కుదుపు దేశీయ ఐటీ రంగ షేర్లలో భారీ కుదుపనకు గురవుతున్నాయి. కృత్రిమ మేధస్సుతో కంపెనీల భవిష్యత్తుపై ఆందోళన నెలకొనడం ఆయా సంస్థల షేర్లు కుప్పకూలుతున్నాయి. ప్రస్తుత నెలలో ఐటీ రంగ సూచీ 20 శాతం వరకు నష్టపోయింది. దీంట్లో ఇన్ఫోసిస్ షేరు 18 శాతం నష్టపోగా, టీసీఎస్ 14 శాతం వరకు పతనం చెందాయి. ఏఐ టూల్స్‌తో కంపెనీ లాభాలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనున్నదని అంచనా మదుపరుల్లో నెలకొనడంతో అమ్మకాల వైపు మొగ్గుచూపారు. ప్రపంచ ఆర్థిక మందగమనం లేదా ఏఐ కారణంగా ఐటీ కంపెనీలు పెద్దమొత్తంలో వ్యాపారాన్ని కోల్పోయే అవకాశాలుండటం ఇందుకు కారణం. ఈ నూతన టెక్నాలజీతో అమెరికా, యూరప్‌నకు చెందిన పలు కంపెనీలు తమ ఖర్చులు భారీగా తగ్గించుకోనున్నాయని తెలుస్తున్నది.
అదానీ గ్రూపు ఫౌండర్ గౌతమ్ అదానీ సంపదలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోవడం విశేషం. ఈ ఏడాదిలో ఆయన సంపదలో ఎలాంటి మార్పు లేదని బ్లూంబర్గ్ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన సంపద 84.6 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నది. కిందటేడాదితో పోలిస్తే 122 మిలియన్ డాలర్లు మాత్రమే పెరిగింది. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ పవర్ లిమిటెడ్ షేర్లు భారీగా నష్టపోయినప్పటికీ అదానీ గ్రూపులోని ఇతర కంపెనీలు అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, ఏసీసీ లిమిటెడ్, అంబుజా సిమెంట్లు ఈ నష్టాన్ని భర్తి చేశాయి.