ఓ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడా ఇజ్జత్ లేదు, పక్క రాష్ర్టానికి వెళితే ఓ యమ్మా వీడు తెలంగాణ వాడు, వీనితో మాట్లాడితే ఏం అడుగుతాడో అని తప్పించుకొని తిరుగుతున్నారు అంటూ చెప్పిన మాటలు అక్షర సత్యం. ముఖ్యమంత్రి హోదా ఉండవచ్చు కానీ ఆ హోదాకు తగిన విధంగా హుందాతనం, జ్ఞానం, విషయ పరిజ్ఞానం, ఎక్కడ ఏం మాట్లాడాలి? అని సంస్కారం లేకపోవడం వల్ల గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆయనకు ఎక్కడా ఇజ్జత్ లేకపోవడం వాస్తవం.
విషయ పరిజ్ఙానం లేదు, కనీసం మంత్రిగా పని చేసిన అనుభవం లేదు, నేర్చుకుందాం అనే ఆసక్తి లేదు, బూతులను నమ్ముకొని రాజకీయం చేస్తూ లాటరీ తగిలినట్టు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కనీసం ఇప్పుడైనా పాలన గురించి అవగాహన పెంచుకోవాలనే ఆసక్తి చూపడంలేదు. సగం పదవీ కాలం ముగిసినా పాలన మీద పట్టు సంగతి అటుంచి, కనీసం అవగాహన కూడా తెచ్చుకోలేదు. అందువల్లనే స్వయంగా ముఖ్యమంత్రే చెప్పినట్టు గల్లీలో ఇజ్జత్ లేదు, ఢిల్లీలో ఇజ్జత్ లేదు. రేవంత్‌రెడ్డి ప్రారంభంలో జాగృతిలో ఆర్టిస్ట్‌గా పని చేశారు. అదే సమయంలో అక్కడ పని చేసిన జర్నలిస్ట్‌తో ఓ సమాచారం కోసం మాట్లాడితే రేవంత్‌రెడ్డికి ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదు. ఆ పాలన, ఆయన ఉపన్యాసాల తిట్లు చూశాక ముఖ్యమంత్రి అని గౌరవం ఇవ్వాలి అనిపించడం లేదు అని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి ఉపన్యాసాల ప్రభావం బాగానే ఉన్నది. సామాన్యులు కూడా సీఎం పాలనపై అదే భాషలో విమర్శిస్తున్నారు.
కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ మేధావులు రేవంత్‌రెడ్డిని అధికారంలోకి తీసుకురావడానికి చాలా కృషి చేశారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక మేధావుల్లో క్రమంగా వ్యతిరేకత మొదలయింది. కాంగ్రెస్ వార్‌రూమ్‌లో ఎన్నికల సమయంలో కీలక పాత్ర వహించిన సంధ్య లాంటి వాళ్లు కూడా కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతూ అసలు సంగతి గ్రహించారు.
రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పది మంది తెలంగాణ వాదులను సత్కరించారు. అలా సత్కారం పొందిన సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి కూడా చంద్రబాబు చెప్పు చేతుల్లో రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారని, ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేస్తున్నారని, చంద్రబాబు ఆంధ్రాకే కాకుండా తెలంగాణకు కూడా సీఎంలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
గతంలో రేవంత్‌తో పోలిస్తే కేసీఆర్ రుషిలా అనిపించారని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి ముందు కేసీఆర్ మహా రుషిలా కనిపిస్తున్నారని అన్నారు. ఉద్యమకారులు చాలా మంది రేవంత్‌రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డజన్ల కొద్ది యూట్యూబ్ చానళ్లు సొంతంగా ఏర్పాటు చేసి, అప్పటి ప్రభుత్వం మీద, కాంగ్రెస్‌లోని సీనియర్ల మీద తప్పుడు ప్రచారం చేయడంతో కాంగ్రెస్‌కు ఏకైక దిక్కు అనే అభిప్రాయం కలిగించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రేవంత్‌రెడ్డి వాస్తవ ఇమేజ్ను ప్రజలకు చూపించి, ఆయన పరువు తీయడంలో యూట్యూబ్ చానళ్లు ముందు వరుసలో ఉన్నాయి. ఏదైనా సభలో వక్తలు సీఎం పేరు మరచిపోవడం కామన్‌గా జరుగుతున్న తంతే. సినీ, క్రీడారంగాల ప్రముఖులు, కేంద్రమంత్రులు, ఆఖరికి గురువు చంద్రబాబు కూడా రేవంత్ పేరు మర్చిపోవడం చూస్తున్నాం. దీనిని ప్రధాన మీడియా చూసీ చూడనట్టు వదిలేసినా యూట్యూబ్ చానళ్లు మాత్రం వదలడం లేదు. హోదాను బట్టి మనిషికి విలువ రాదు. హోదా ను బట్టి పైకి గౌరవం ఇస్తున్నట్టు
నటించినా అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలు అంతగా పట్టించుకోరు. మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావ చ్చు విషయ పరిజ్ఞానం లేకపోతే ఐఏఎస్‌లు అస్సలు పట్టించుకోరు. పైకి వినయం నటించినా తోటి అధికారులతో కలిసి సీఎం, మంత్రులపై జోకులు వేస్తుంటారు.
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా ఎక్కడికి వెళ్లినా బూతు ఉపన్యాసాల్లో తప్ప రాష్ట్రంలో ప్రభావం చూపలేదు. అందుకే చాలామంది సాధారణ ప్రజలకు అసలు ఆయన పేరే తెలియదు. పాలనలో తనదైన ముద్ర వేస్తే పేరు గుర్తు ఉండేది. 108 అంబులెన్స్ సైరన్ వినగానే వైఎస్ఆర్ గుర్తుకువస్తారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ పథకాలను పలు రాష్ర్టాలతోపాటు కేంద్రం కూడా ఆదర్శంగా తీసుకొని అమలు చేసింది. ఇలాంటి అద్భుతమైన పథకాల వల్ల కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఒక కొత్త రాష్ట్రం సరైన ప్రణాళికతో వెళ్తే ఏ విధంగా అభివృద్ధి సాధ్యమో తొమ్మిదిన్నరేండ్లలో కేసీఆర్ పాలన దేశానికి చూపించింది.
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రారంభించిన సబ్సిడీ బియ్యం, మధ్యాహ్న భోజనం వంటి ఉచిత పథకాలన్నింటికీ ఆది గురువు తమిళనాడు. చివరకు కేంద్ర ప్రభుత్వం దేశమంతా అమలు చేస్తున్నది. తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతం అంటే కరువుకు కేరాఫ్ అన్నట్టు ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2021-22లో దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి, అత్యధిక వరి సేకరించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అదే విధంగా 2015-16 నుంచి 2018-19 మధ్య 14.2 శాతం జీఎస్డీపీ వృద్ధి రేటుతో పెద్ద రాష్ర్టాల్లో దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. అభివృద్ధితోపాటు అనేక వినూత్న పథకాలతో తెలంగాణ మాడల్ అనే గుర్తింపు దేశ వ్యాప్తంగా లభించింది. ఆ స్థితి నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్‌రెడ్డి పాలన ఇజ్జత్ లేని స్థితికి తీసుకువచ్చింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరూ ఇజ్జత్ ఇవ్వడం లేదని స్వయంగా రేవంత్‌రెడ్డి చెప్పుకొంటున్నారు. ఇజ్జత్ లేనిది తనకే కానీ, తెలంగాణకు కాదు అనే విషయం రేవంత్‌రెడ్డికి బాగా తెలుసు. ఈ విషయం గుర్తుంచుకొని మిగిలిన రెండేండ్ల కాలంలోనైనా ఏమైనా మారుతారేమో చూడాలి.