ముంబై: మహారాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఈటీ) ప్రశ్నాపత్రం లీక్ కేసులో ప్రధాన సూత్రధారి కొన్ని నెలలుగా పరారీలో ఉన్నాడు. చాలా కాలం పోలీసుల కళ్లగప్పి తప్పించుకుంటున్నాడు. అతడు బీహార్‌లో ఉన్నట్లు తెలుసుకున్న మహారాష్ట్ర పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్ట్ చేశారు. (TET Paper Leak) మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ ప్రధాన సూత్రధారి బిజేంద్ర గుప్తా, ఈ కేసులో నిందితుడైన అతడి అనుచరుడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ రిమాండ్‌పై మహారాష్ట్రకు తీసుకువచ్చి టెట్ పేపర్ లీక్ నెట్వర్క్, ఇలాంటి కేసుల్లో అతడి ప్రమేయాన్ని ప్రశ్నించనున్నారు. దేశవ్యాప్తంగా ఇతర పరీక్షా పత్రాల లీక్ సిండికేట్లతో బిజేంద్ర గుప్తాకు ఉన్న సంబంధాలను కూడా పోలీస్ అధికారులు పరిశీలిస్తున్నారు.
కాగా, మహారాష్ట టెట్ పేపర్ లీక్ కేసులో బిజేంద్ర గుప్తా భార్యతో సహా 12 మంది నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. కొన్ని నెలలుగా పరారీలో ఉన్న బిజేంద్ర గుప్తా, అతడి అనుచరుడి అరెస్ట్‌తో ఈ సంఖ్య 14కు చేరింది. దేశవ్యాప్తంగా అనేక పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ కేసులతో బిజేంద్ర గుప్తాకు సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.