LPG Tanker : 28 మంది భారతీయులు పనిచేస్తున్న నౌకపై ఇరాన్ జలాల్లో దాడి జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదని, భారతీయులు సహా నౌకలోని సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. మొజాంబిక్ దేశానికి చెందిన ఐఎంవో నెం.8818219 అనే దిశ పేరుగల నౌకపై దాడి జరిగిందని రాయబార కార్యాలయం తెలిపింది.
ఈ ఘటనపై సంబంధిత అధికారులను సంప్రదిస్తున్నామని తెలిపింది. దాడి జరిగిన నౌకలో 28 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారంతా సురక్షితంగా ఉన్నారని వివరించింది. అధికారులను సంప్రదిస్తూ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని రాయబార కార్యాలయం తెలిపింది. అయితే, ఈ దాడికి కారకులు ఎవరు, ఎలా దాడి జరిగింది అనే వివరాల్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. నౌకకు ఏమైనా నష్టం వాటిల్లిందా అనే విషయంలో కూడా స్పష్టత లేదు. అంతకుముందు రోజే కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ఈ తరహా దాడుల్ని ఖండించారు. వాణిజ్య నౌకలు, పౌర నౌకలపై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు.
మనీలాలో గురువారం జరిగిన ఈస్ట్ ఏసియా సదస్సులో జైశంకర్ పాల్గొన్నారు. అంతర్జాతీయ జలాల్లో భద్రత ఉండాలని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం వాటిని నిరంతరం తెరిచే ఉంచాలని కోరారు. ఏ పరిస్థితుల్లోనైనా వాణిజ్య నౌకలు, పౌర నౌకలపై దాడులు చేయకూడదని, సముద్రాల్లో ప్రయాణించే సిబ్బందిపై దాడి చేయడం సరికాదన్నారు.