కోదాడ, జూలై 7 : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ సామాన్య జనాన్ని ఆందోళకు గురిచేస్తున్నది. ఫారాల భర్తీలో కనీస అవగాహన లేకపోవడంతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ ఫారాల్లో తప్పులు దొర్లితే తమ ఓట్లు ఎక్కడ గల్లంతు అవుతాయోమోననే భయం వారిలో చోటు చేసుకుంటోంది. అక్షర జ్ఞనం ఉన్నవారే ఈ ఫారాలు నింపే విషయంలో అయోమయానికి గురవుతున్నారు. ఇక నిర్లక్షరాస్యులైన వారి పరిస్థితి చెప్పనలవి కాదు.. కోదాడతో పాటు నియోజకవర్గంలోని 70 శాతం మందికి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఫారాల్లోని అంశాలను సజావుగా నింపే విషయంలో అవగాహన లేదు.
తమ ఓట్లు గల్లంతయితే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయోమోననే ఆందోళనతో బీఎల్వోలు ఇచ్చిన ఫారాలను తీసుకొని తెలిసిన వారి చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా 2002 సంవత్సరంలో ఏ బూత్‌లో ఓటు వేశామో గుర్తు లేని పరిస్థితుల్లో ఆ సమాచారాన్ని 2026 ఓటర్ల జాబితాతో సరిపోల్చడం ఇబ్బందిగా మారింది. ఈ సమాచారంలో అక్షర దోషాలు ఉన్నప్పటికీ ఇంటర్నెట్లో కూడా సమాచారం దొరకని పరిస్థితి నెలకొన్నది. 2002 ఓటరు జాబితాలో ఎపిక్ నంబర్ లేకపోవడం వల్ల ఇప్పుడు మరింత ఇబ్బందిగా మారింది.
ఇతర గ్రామాల నుంచి అత్తగారి ఇండ్లకు వచ్చిన మహిళలకు సర్ నమోదు ప్రక్రియలో భాగంగా వేరే గ్రామాల్లో ఉన్న తల్లిదండ్రుల సమాచారం, ఇంటి పేరు మార్పుతో సమస్య ఉత్పన్నమవుతున్నది. కోదాడ పట్టణ ఓటరు సమాచారం కోసం అన్ని పోలింగ్ బూత్‌లలో వెతకాల్సి వస్తున్నది.. వెయ్యి మంది ఓటర్లకు ఒక బీఎల్వోను ఎంపిక చేయడం మరింత భారంగా మారింది. దీంతో పాటు అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆర్పీలు, ఆశా వర్కర్లకు సైతం సర్ ప్రక్రియలో భాగంగా బాధ్యతలు అప్పగించడం, వారికి సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన లేకపోవటం సమస్యగా మారింది.
అద్దె ఇండ్లలోని ఓటర్లకు సర్ ఫారాలు అందజేయడం తలనొప్పిగా మారిందని, ఇప్పటికీ అవి తమ వద్దే ఉన్నాయని బీఎల్వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2002లో ఇంటి నంబర్లకు 2026లో ఇంటి నంబర్లకు పొంతన లేని సమాచారం ఉండటంతో ఫారాలు భర్తీ చేసే వారికి ఇబ్బందిగా మారింది. ఓటర్ల జాబితా పరిశీలనలో ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా ఎన్నికల కమిషన్ గడువు తేదీని పొడిగించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి..
2002లో ఎక్కడ ఓటు వేశామో గుర్తు లేదు. అలాంటప్పుడు 2026 సంవత్సరంలోని ఓటరు జాబితాతో పొంతన లేని పరిస్థితి నెలకొని ఉంది. దీని వల్ల తప్పనిసరిగా ఓట్లు గల్లంతవుతాయి. బీఎల్వోలే ఇంటింటికి తిరిగి ఈ ఫారాలు భర్తీ చేసేలా ఏర్పాట్లు చేయాలి.
-మునీర్, సామాజిక కార్యకర్త
పథకాలు నిలిచిపోతాయోమోననే భయం..
ఓటరు జాబితాలో పేరు నమో దు కాకపోతే రేషన్ కార్డు, ఇతర సంక్షేమ పథకాలు నిలిచిపోతాయనే ప్రచారం జరుగుతున్నది.. సర్ ఫారాలు పట్టుకుని రెండు రోజుల నుంచి తిరుగుతున్నా. ఇండ్లకే వచ్చి బీఎల్వోలు ఫారాలు నింపాలి.
-సుధ గృహిణి, శ్రీమన్నారాయణ కాలనీ
ఓట్లు గల్లంతు కాకుండా చర్యలు తీసుకోవాలి..
ఫారాల భర్తీ ప్రక్రియ నిర్లక్షరాస్య ఓటర్లను ఆందోళన గురి చేస్తున్నది. ఫారంలోని నిబంధనలపై వారికి కనీస అవగాహన లేదు. బీఎల్ఓల చేత ఇంటింటికీ వెళ్లి ఫారాలు నింపి ఓట్లు గల్లంతు కాకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే.. నా వార్డులో కూలి పనులు చేసుకునే వారి సంఖ్యే ఎక్కువ. 2002 నాటి జాబితాలోని వివరాలు చెప్పలేకపోతున్నారు. దీంతో ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. నాతో పాటు మరో ముగ్గురు బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి సర్ పారాలు నింపుతున్నా.
-చీమ నరేష్, 9 వార్డు కౌన్సిలర్, కోదాడ మున్సిపాలిటీ