ఆధునిక నగరీకరణ ప్రకియలో అభివృద్ధి, మానవీయ విలువల మధ్య సమతుల్యత అనేది నిరంతరం చర్చనీయాంశంగా మారుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, దాని అంతర్భాగమైన గాంధీ సరోవర్ నిర్మాణం ఈ చర్చను మరోసారి తెరపైకి తెచ్చాయి.
చారిత్రక పాధాన్యం కలిగిన బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎత్తయిన గాంధీ విగ్రహాన్ని నెలకొల్పడం, నదీ తీరాన్ని వాణిజ్య కేంద్రంగా మార్చడమే లక్ష్యాలు అంటూ చేపట్టిన ఈ ప్రాజెక్టు, స్థానిక నివాసితుల, ముఖ్యంగా లంగర్‌హౌస్ సమీపంలోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఒక ఇల్లు అనేది కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కూడిన నిర్మాణం కాదని, అది దశాబ్దాల జ్ఞాపకాలు, భావోద్వేగాలు, సామాజిక అనుబంధాల సంగమమని నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక విచ్ఛిన్నం ద్వారా నిర్మితమయ్యే స్మారక చిహ్నాలు అసలైన అభివృద్ధిని ప్రతిబింబిస్తాయా అనే నైతిక పశ్న ఇక్కడ ఉద్భవిస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం మూసీ నదిని శుద్ధి చేసి, దానిని అంతర్జాతీయ స్థాయి పర్యాటక, వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ ప్రాజెక్ట్ సుమారు 55 కిలోమీటర్ల పొడవునా జంట జలాశయాల నుంచి గౌరెల్లి వరకు విస్తరించి ఉన్నది. దీనిని నిర్వహించడానికి ప్రభుత్వం ‘మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్ డీసీఎల్) అనే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసింది. ప్రాజెక్ట్ మొదటి దశలో 21 కిలోమీటర్ల మేర పనులు చేపట్టాలని నిర్ణయించింది.
మొదటి దశను (ఫేజ్-1) రెండు ప్రధాన భాగాలుగా విభజించింది. మొదటి దశలో భాగంగా హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్ల వరకు పనులు చేపడుతున్నారు. కిస్మత్పూర్, హైదర్‌గూడ, బండ్లగూడ జాగీర్ తదితర ప్రాంతాలు ఉన్నాయి. రెండో దశలో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల మేర పనులు చేపడుతుండగా, ఇందులో ప్రధానంగా గండిపేట, నార్సింగి, మంచిరేవుల ప్రాంతాలు ఉన్నాయి. ఈ మొత్తం జోన్-1 విస్తీర్ణంలో 21.0 కి.మీ వరకు రాజేంద్రనగర్, గండిపేట మండలాలు ప్రభావితమవుతున్నాయి.
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ మూసీ, ఈసా నదుల సంగమ ప్రాంతమైన బాపూఘాట్ వద్ద ప్రతిపాదించారు. 1948 ఫిబ్రవరిలో గాంధీ చితాభస్మాన్ని ఈ సంగమ ప్రాంతంలోనే నిమజ్జనం చేశారు. దీనివల్ల ఈ ప్రాంతానికి అత్యంత చారిత్రక ప్రాధాన్యత ఉన్నది. ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తయిన గాంధీ విగ్రహం, గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ, శాంతి విగ్రహ మ్యూజియం, హ్యాండ్లూమ్ ప్రమోషన్ హబ్, నాలెడ్జ్ సెంటర్, మెడిటేషన్ విలేజ్, గేట్‌వే ఆఫ్ హైదరాబాద్, ఐకానిక్ టవర్ నిర్మాణాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్తున్నది. కానీ ఇది బడా వాణిజ్యవేత్తల ప్రయోజనాల కోసం రూపొందించారని నిరసనకారులు, భూములు కోల్పోతున్న రైతులు ఆరోపిస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల విదేశీ రుణాలతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టులో వందల ఎకరాల వాణిజ్య వీధులను ఏర్పాటు చేయడం వెనుక కార్పొరేట్ శక్తుల హస్తం ఉన్నదని విమర్శలు చేస్తున్నారు.
ప్రాజెక్ట్ అమలు కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో భూసేకరణకు పూనుకున్నది. 2026 ఫిబ్రవరి 10న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, నది గరిష్ట వరద మట్టం నుంచి ఇరువైపులా 50 మీటర్ల మేర బఫర్ జోన్‌ను ప్రభుత్వం గుర్తించింది. భూసేకరణ ప్రకియలో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యే అవకాశం ఉన్నది. ఒక అధికారిక అంచనా ప్రకారం సుమారు 55 కిలోమీటర్ల పొడవునా 3,279 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, 10,017 ఆస్తులు ప్రభావితమవుతాయి.
భూసేకరణ ఇంతటితో ఆగుతుందా? ఇంకా పెరుగుతుందా అనే సందేహాలు ఉన్నాయి. రాజేంద్రనగర్, గండిపేట మండలాల్లోని కిస్మత్పూర్, బండ్లగూడ, హైదర్‌గూడ, జాగీర్ వంటి గ్రామాల్లో ఇప్పటికే భూసేకరణ కోసం నోటీసులు జారీ అయ్యాయి. ఆయా ప్రాంతాల్లో బఫర్‌జోన్ భూములతోపాటు వక్ఫ్, పట్టా భూములు పోతున్నాయి. వీటితోపాటు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్, వాణిజ్య, నివాస సముదాయాలు, ఇండ్లు పోతున్నాయి. ఈ భూసేకరణ ప్రకియలో కేవలం మురికివాడలే కాకుండా, చట్టబద్ధమైన అనుమతులు కలిగిన అపార్ట్మెంట్లు, కాలనీలు కూడా ఉండడం తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతున్నది.
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ వల్ల అత్యంత తీవ్రంగా ప్రభావితమవుతున్న నిర్మాణాల్లో మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఒకటి. ఈ సముదాయం కేవలం ఒక భవనం కాదు. అక్కడ నివసిస్తున్న 450 కుటుంబాలకు అది ఒక జీవన ప్రపంచం. మధు పార్క్ రిడ్జ్ అనేది చట్టవిరుద్ధమైన నిర్మాణం కాదు. దీనికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నుంచి అనుమతులు ఉన్నాయి. తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్‌ఆర్‌ఈఆర్‌ఏ) వద్ద రిజిస్టర్ అయి ఉన్నది.
ఈ సముదాయంలో రెండు జీ+5 బ్లాకులు ఉన్నాయి. మొత్తం 410 నుంచి 425 వరకు ఫ్లాట్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నది. నివాసితుల అభిప్రాయం ప్రకారం, ఇల్లంటే కేవలం నివాసం మాత్రమే కాదు. అది చెమట చుక్కల సరోవరం. భావోద్వేగాల సమాహారం. సమాజాన్ని కూల్చేసి సరస్సులు నిర్మించడం అనేది అసంబద్ధమైన ఆలోచనగా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మధు పార్క్ రిడ్జ్ వాసులు, ‘మూసీ జన ఆందోళన’ (ఎంజేఏ) వంటి స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం జారీ చేసిన జీవో 921పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. భూసేకరణ చట్టం-2013 లోని కొన్ని కీలక నిబంధనల నుంచి ప్రాజెక్టుకు ఈ జీవో మినహాయింపు ఇచ్చింది. భూసేకరణ చట్టం ప్రకారం ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు సామాజిక ప్రభావ అంచనా నిర్వహించడం తప్పనిసరి. కానీ జీవో 921 ద్వారా కొన్ని కీలక ప్రక్రియలను ప్రభుత్వం పక్కన పెట్టింది. ప్రభావితం అయ్యే ప్రజలతో చర్చలు జరపడం, వారి అభ్యంతరాలను వినడం వంటి ప్రక్రియలను రద్దు చేశారు.
మూసీ పునరుజ్జీవనం, గాంధీ సరోవర్ ప్రాజెక్టుల వెనుక భారీ ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ పాజెక్ట్ కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి నిధులను సేకరిస్తున్నది. ప్రాజెక్ట్ మొదటి దశ కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) సుమారు రూ.4,100 కోట్ల రుణాన్ని మంజూరు చేయడానికి ప్రాథమికంగా అంగీకరించింది. ప్రభుత్వం అధికారికంగా మొదటి దశకు రూ.5,641 కోట్లు ఖర్చవుతుందని చెప్తుండగా, విపక్షాలు ఇది రూ.1.5 లక్షల కోట్ల ప్రాజెక్ట్ అని, దీనివల్ల రాష్ట్రంపై భారీ రుణ భారం పడుతుందని విమర్శిస్తున్నాయి. కేవలం ఒక విగ్రహం, స్మారకం కోసం రూ.5,000 కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
బడా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ చేపట్టిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు, నిర్వాసితులు నిరసనకారులు ఆరోపిస్తున్నారు. నదీ తీరంలో ఏర్పాటు చేయబోయే వాణిజ్య వీధులు, మాల్స్ అదానీ, అంబానీ వంటి సంస్థలకు లేదా వారి బినామీలకు అప్పగించే పన్నాగం ఉన్నదని ప్రచారం జరుగుతున్నది. ప్రభుత్వంలోని ముఖ్యనేతకు సన్నిహితంగా ఉండే కొన్ని కంపెనీలు (ఉదాహరణకు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్) వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నారు.
నది ఒడ్డున ఉన్న చెట్లు, సహజ సిద్ధమైన పచ్చదనాన్ని తొలగించి, కాంక్రీట్ నిర్మాణాలతో ‘స్మార్ట్ సిటీ’ లు నిర్మించడం పర్యావరణానికి మేలు చేయదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. బాపూఘాట్ సమీపంలోని డిఫెన్స్ భూములు నగరానికి ఊపిరితిత్తులు వంటివని, వాటిని వాణిజ్య అవసరాలకు వాడడం వల్ల నగరంలో కాలుష్యం పెరుగుతుందని నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ పభుత్వం గాంధీ సరోవర్ ప్రాజెక్టును గుజరాత్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గంగా ప్రాజెక్టులతో పోలుస్తున్నది. అహ్మదాబాద్‌లో సుమారు 60,000 కుటుంబాలను తరలించి సబర్మతి రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టును పూర్తి చేశారు. అయితే అక్కడ తరలించిన వారిలో అత్యధికులు ఆక్రమణదారులు కాగా, హైదరాబాద్‌లో చట్టబద్ధమైన గృహ యజమానులు కూడా బాధితులుగా మారుతున్నారు. సబర్మతి ప్రాజెక్టులో బాధితులకు ఇచ్చిన పునరావాసంపై ఇప్పటికీ చర్చలు జరుగుతున్నాయి. హైదరాబాద్ వంటి మహానగరంలో మధ్యతరగతి ప్రజలకు వారి ప్రస్తుత జీవన ప్రమాణాలకు అనుగుణంగా పునరావాసం కల్పించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారనున్నది.
మూసీ పునరుజ్జీవనం పేరుతో చేపట్టే ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రజల కన్నీళ్లపై నిర్మితం కాకూడదు. మధు పార్క్ రిడ్జ్ నివాసితుల ఆందోళనలు కేవలం ఆస్తికి సంబంధించినవి కాదు. అవి వారి అస్తిత్వానికి, హక్కులకు సంబంధించినవి. నివాసితులు ఇప్పటికే కోర్టులను ఆశ్రయించడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం కేవలం వాణిజ్య పరమైన కోణంలోనే కాకుండా, మానవీయ కోణంలో ఈ సమస్యను చూడాల్సి ఉన్నది. విదేశీ రుణాల కోసం, కార్పొరేట్ ప్రయోజనాల కోసం సామాన్యులను బలి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కేవలం రాయి, రప్పలతో కూడిన స్మారకంలా కాకుండా, గాంధీ ఆశయాలకు అనుగుణంగా అందరినీ కలుపుకుపోయే వికాసానికి చిహ్నంగా ఉండాలని సమాజం ఆశిస్తున్నది. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్పష్టమవుతున్న విషయం ఏమిటంటే, పర్యావరణ పునరుద్ధరణ, పర్యాటక అభివృద్ధి మధ్య ప్రజల జీవన హక్కులు నలిగిపోతున్నాయి. ప్రభుత్వం తన అభివృద్ధి నమూనాను పునఃసమీక్షించుకొని, బాధితులకు న్యాయం చేసే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
-మేకల ఎల్లయ్య ,99121 78129