హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితి నెలకొన్నది. పలు జిల్లాల్లో భారీ వానలు కురుస్తుండగా, కొన్ని జిల్లాల్లో మాత్రం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు 29 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో అత్యధికంగా 42.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు పేర్కొన్నది. 21 జిల్లాల్లో 42.2 నుంచి 42.8 డిగ్రీల మధ్య, నాలుగు జిల్లాల్లో 41నుంచి 41.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపింది.
రాబోయే రెండ్రోజులపాటు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అకడకడా వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, రాబోయే రెండ్రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని తెలిపింది. దీనికితోడు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతున్నట్టు వెల్లడించింది.