Bombay HC : అయోధ్య (Ayodhya) లోని బాబ్రీ మసీదు (Babri Masque) ను కూల్చివేసి ఉండకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం “దేశ వ్యతిరేక చర్య” కిందకు రాదని బాంబే హైకోర్టు (Bombay High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) కి చెందిన ఇద్దరు సభ్యులపై ముంబై పోలీసులు (Mumbai Police) జారీ చేసిన నగర బహిష్కరణ ఉత్తర్వులను న్యాయస్థానం రద్దు చేసింది.
కాగా ఎస్డీపీఐ కార్యకర్తలు ఫిరోజ్ అబ్దుల్ వహాబ్ ఖాన్, మహమ్మద్ రఫిక్ గులాం రసూల్ అన్సారీలను ఏడాది కాలంపాటు నగరం నుంచి బహిష్కరిస్తూ ముంబై పోలీసులు 2025 డిసెంబర్ 3న ఉత్తర్వులు జారీచేశారు. వక్ఫ్ సవరణ బిల్లు, చెంబూర్-గోవండి ప్రాంతంలోని సిమెంట్ గోడౌన్లవల్ల కలుగుతున్న వాయు కాలుష్యం, బాబ్రీ మసీదు కూల్చివేతకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలకు సంబంధించి 2024, 2025 సంవత్సరాల్లో నమోదైన మూడు ఎఫ్ఐఆర్ల ఆధారంగా పోలీసులు ఈ చర్య చేపట్టారు.
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ మాధవ్ జమ్దార్.. పోలీసుల చర్యలపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. “వారి అభిప్రాయం ప్రకారం, బాబ్రీ మసీదును కూల్చివేసి ఉండకూడదు. అది వారి వ్యక్తిగత అభిప్రాయం. అది దేశ వ్యతిరేక చర్య ఎలా అవుతుంది..? ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ భిన్నాభిప్రాయాలు కలిగి ఉండే హక్కు ఉంది” అని జస్టిస్ జమ్దార్ వ్యాఖ్యానించారు.
పిటిషనర్లపై నమోదైన ఎఫ్ఐఆర్లలో ఒకటి ప్రతిపక్షాలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంబంధించినదని, అందులో కాంగ్రెస్, శివసేన (యూబీటీ) కార్యకర్తలు కూడా పాల్గొన్నప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టు గుర్తించింది. వారు చేసిన నినాదాలు సమాజంలో చీలికలు తెస్తాయన్న ప్రభుత్వ వాదనలకు ఎటువంటి ఆధారాలు చూపలేదని కోర్టు స్పష్టంచేసింది. కేవలం ఊహాజనిత భయాల ఆధారంగా పౌరుల ప్రాథమిక హక్కులను హరించలేమని, నగర బహిష్కరణ అనేది అసాధారణ చర్య అని, ఇటువంటి సందర్భాల్లో చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటించాలని న్యాయస్థానం తేల్చిచెప్పింది.