హైదరాబాద్, జూన్ 12 (నమస్తేతెలంగాణ): ‘బీఆర్ఎస్ పదేండ్ల పాలనలోనే హైదరాబాద్ చాలా బాగుండేది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఐదు రోజులకొకసారి లోప్రెజర్ నీటి సరఫరాతో జీవితం నరకంగా మారింది.’ అంటూ ఐటీ ఉద్యోగులు, కొంపల్లి శ్వేతాశుభం రెసిడెన్సీవాసులు పేర్కొన్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. రేవంత్‌రెడ్డి రెండున్నరేండ్ల పాలనలో పడుతున్న కష్టాలను ఏకరువు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో మౌలిక వసతుల కల్పనపై నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో రోజు విడిచి రోజు నిరంతరాయంగా నీటి సరఫరా జరిగేదని గుర్తుచేసుకున్నారు.
కానీ ప్రస్తుతం తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలిపారు. బోయిన్పల్లి నుంచి సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్ వరకు కేంద్రం చేపడుతున్న ఫ్లైఓవర్ పనులు పర్యవేక్షణాలోపంతో నిలిచిపోయాయని, దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొంపల్లి మీదుగా మేడ్చల్ వరకు మెట్రోను విస్తరిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఆ దిశగా ఎలాంటి ముందడుగు వేయలేదని మండిపడ్డారు. ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయని, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద అసెంబ్లీలో, బయట ప్రభుత్వాన్ని నిలదీసినా పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. సమస్యలు మొత్తం సావధానంగా విన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.