Peddi Sudarshan Reddy | నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హనుమకొండలోని నివాసంలో ఉండగా ఆదివారం ఉదయం ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన రోహిణి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం గ్రీన్ చానల్ ద్వారా సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు.
కాగా, పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురైందన్న సమాచారం తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన హైదరాబాద్ నుంచి హనుమకొండకు బయల్దేరి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు అంబులెన్స్‌లో తరలించారు. ఈ క్రమంలో అంబులెన్స్ వెంట కేటీఆర్, హరీశ్‌రావు బయల్దేరారు.
అంతకుముందు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై రోహిణి ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. హార్ట్ స్ట్రోక్‌తో హాస్పిటల్‌కు తీసుకురావడంతో చికిత్స మొదలు పెట్టామని పేర్కొన్నారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించామని, ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నాం. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని సూచించారు.