బుధవారం 03 జూన్ 2020
Telangana - May 19, 2020 , 01:42:34

అప్పులకు షరతులెందుకు?

అప్పులకు షరతులెందుకు?

  • పేదలకు ఆండగా నిలువని కేంద్రం 
  • ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శ

సంగారెడ్డిప్రతినిధి, నమస్తేతెలంగాణ: కరోనా నేపథ్యంలో అన్ని వర్గాలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్ర భుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. కేవలం 5 కిలోల చొప్పున బియ్యం అందజేసి చేతులు దులుపుకొన్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వా లు అప్పులు తీసుకోవచ్చని చెబుతూనే షరతులు విధించడం ఏమిటని? ఇలాంటి ఆపత్కాలంలో షరతులు ఎందుకని ప్రశ్నించారు. సోమవారం మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జానపద కళాకారులకు సరుకులు పంపిణీ చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో పరిశ్రమల యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ కారణంగా పేదలను ఆదుకోవాల్సిన కేంద్రం పట్టనట్టు వ్యవహరించిందని ఆరోపించారు. కేంద్రం ఏ మాత్రం సహకరించకపోయినా సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం, కుటుంబానికి రూ.1,500 చొప్పున నగదు అందించినట్టు తెలిపారు. రెండు దఫాల్లో నగదు పంపిణీ కోసమే రూ.2,500 కోట్లను పేదల ఖాతాల్లో జమచేశామన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పరిశ్రమలు కచ్చితంగా నిబంధనలు పాటించాలని, లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇటీవల వైజాగ్‌ ప్రమాద ఘటన నేపథ్యంలో ఇక్కడి పరిశ్రమల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమీక్షలో జెడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కలెక్టర్‌ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. 


logo