రంగారెడ్డి, జూన్ 4 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు మండలాల ఫార్మా బాధితుల ఇండ్ల స్థలాల కేటాయింపునకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు అడ్డంకిగా మారినట్టు తెలుస్తున్నది. ఫార్మా బాధితుల కోసం ఏర్పాటుచేసిన ప్లాట్ల నుంచి కొంతభాగం గ్రీన్‌ఫీల్డ్ రోడ్డులో పోతున్నందున ప్లాట్ల కేటాయింపులో తీవ్ర జాప్యం జరుగుతున్నది. మరోవైపు ఫార్మా బాధిత రైతులకు గత ప్రభుత్వం ప్లాట్లు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ సర్కార్ ఇంతవరకు పొజిషన్ చూపించకపోవటంతో తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. మరోవైపు బాధిత రైతులందరికీ వెంటనే ప్లాట్లు కేటాయించాలని కోరుతూ.. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.
15 రోజుల్లో ఇండ్ల స్థలాల కేటాయింపు ప్రారంభిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కానీ పదిహేను రోజుల్లో సాధ్యమవుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కందుకూరు, యాచారం మండలాల్లో ఫార్మాసిటీ ఏర్పాటుకోసం రైతుల నుంచి 14 వేల ఎకరాల భూసేకరణ చేపట్టింది. ఈ భూసేకరణ ద్వారా భూములు కోల్పోతున్న రైతులకు కందుకూరు మండలం మీర్ఖాన్పేట్ అనుబంధ గ్రామమైన పంజాగూడలో 1,582 ప్లాట్లతో వెంచర్ ఏర్పాటుచేశారు.
ఈ వెంచర్లో భూములు కోల్పోయిన రైతులకు ఇండ్ల స్థలాలు ఇవ్వటానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టాలు కూడా పంపిణీ చేసింది. భూములు కోల్పోయిన రైతులకు సుమారు ఆరువందల ఎకరాల్లో 1,582 ప్లాట్లను ఏర్పాటు చేశారు. ఈ ప్లాట్లను రైతులకు కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా, ఫ్యూచర్ సిటీ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన 330 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్‌రోడ్డు ఈ ప్లాట్లలో కొంతభాగం నుంచి వెళ్తుంది. దీంతో సుమారు 250 ప్లాట్లు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డులో కలుస్తున్నాయి. ఈ కారణాల వల్లే ఇండ్ల స్థలాల కేటాయింపులో జాప్యం జరుగుతున్నది.
ఫార్మాసిటీ ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన రైతులు కందుకూరు మండలంలో 868, యాచారం మండలంలో 979 మంది ఉన్నారు. వీరు మొత్తం 1,847 మంది ఉండగా, ప్రభుత్వం ఏర్పాటుచేసిన వెంచర్లో 1,582 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. మరోవైపు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కారణంగా మరో 250 ప్లాట్లు రోడ్డులో కలుస్తున్నాయి. ఈ పరిస్థితిలో రైతులందరికి సరిపడా ప్లాట్లు కావాలంటే మరికొన్ని ఎకరాలు అవసరం. ఈ ప్లాట్లు చేసే ప్రక్రియ ఆలస్యమయ్యే పరిస్థితి ఉన్నందున ఫార్మా బాధిత రైతులకు ఇప్పట్లో ప్లాట్లు ఇచ్చే పరిస్థితి కన్పించటంలేదు. ప్లాట్ల పంపిణీలో మరింత జాప్యం జరిగే అవకాశాలున్నాయి.
ఫార్మాసిటీ ఏర్పాటుకోసం భూములిచ్చిన రైతులకు ఇప్పటివరకు ఇండ్ల స్థలాలు కేటాయించకపోవటంపై రైతుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది. మరోవైపు బీఆర్ఎస్, సీపీఎం పార్టీల నేతలు ఫార్మా బాధిత రైతులందరికి వెంటనే ప్లాట్లు ఇవ్వాలంటూ వారికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఈ రెండుపార్టీలకు చెందిన నాయకులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. ఫార్మాసిటీ కోసం ఇచ్చిన భూముల్లో ఇప్పటికే ప్రభుత్వం సర్వేచేసి కంచెవేసింది. పట్టాలివ్వకుండానే కంచెవేయటంపై రైతులు నిరసన వ్యక్తం చేస్త్తూ పలుచోట్ల కంచెవేసే పనులను అడ్డుకున్నారు. పోలీసుల సహాయంతో అధికారులు కంచెకూడా వేశారు. భూములు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం బాధిత రైతులకు ప్లాట్లు ఇవ్వకుండా జాప్యం చేయటాన్ని పలు ప్రజాసంఘాలు కూడా తప్పుబడుతున్నాయి.
ఫార్మాసిటీ కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు గుంట చొప్పున ఇండ్ల స్థలాలకు సంబంధించిన సర్టిఫికెట్లు ఇచ్చింది. మీర్ఖాన్పేట్ సమీపంలో ఆరువందల ఎకరాల్లో వెంచర్ ఏర్పాటుచేసింది. ఆ వెంచర్లో పట్టాలు ఇవ్వటానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి 18నెలలు పట్టింది. మరోవైపు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు 330 ఫీట్ల వెడల్పుతో ఏర్పాటు చేస్తుండటంతో లేఅవుట్లో నుంచి సుమారు 250 ప్లాట్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులిచ్చిన భూముల చుట్టూ పెన్సింగ్ కూడా వేసింది. ఈ పరిస్థితిలో భూములు కోల్పోయిన 1,847 మంది రైతులకు పదిహేను రోజుల్లో ఇంటి స్థలాలను కేటాయించాలి. లేనిపక్షంలో రైతులకు మద్దతుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం.
– సబితాఇంద్రారెడ్డి, మాజీ మంత్రి