నిర్మల్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): భూమి సమస్యపై వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన వృద్ధరైతుపై ఓ పోలీసు కర్కశత్వం ప్రదర్శించాడు. గోడు వెళ్లబోసుకుంటున్న అన్నదాతను మెడపట్టి బయటకు గెంటేశాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాతఎల్లాపూర్ గ్రామంలో బుధవారం జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులో ఈ ఘటన చోటుచేసుకున్నది. పోలీసు అధికారి దౌర్జన్యానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
బుధవారం ఖానాపూర్ తహసీల్దార్ సుజాత ఆధ్వర్యంలో జరిగిన భూభారతి సదస్సుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లెపు వెంకటి అనే వృద్ధరైతు తన భూమికి సంబంధించిన సమస్యపై ఫిర్యాదు చేసేందుకు సదస్సుకు వచ్చాడు. అధికారికి వినతపత్రాన్ని ఇస్తూనే ఆ గ్రామ మాజీ సర్పంచ్ చంద్రయ్యతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించాడు. రైతు వెంకటి తీరుపై అసహనం వ్యక్తం చేసిన తహసీల్దార్.. ఆయనను బయటకు పంపాలంటూ అక్కడే ఉన్న ఏఎస్సై రాంచందర్‌ను ఆదేశించారు.
సహనంకోల్పోయిన ఏఎస్సై రాంచందర్ వృద్ధుడని కూడా చూడకుండా వెంకటి మెడపట్టుకుని బలవంతంగా బయటకు నెట్టుకొచ్చాడు. ఏఎస్సై తీరుతో అక్కడ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. గోడు చెప్పుకోవడానికి రావడమే తాను చేసిన తప్పా అంటూ వెంకటి కన్నీరు పెట్టుకున్నాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. విమర్శలు వెల్లువెత్తడంతో దిగివచ్చిన ప్రభుత్వం పోలీస్ అధికారిపై చర్యలకు ఆదేశించింది. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచనల మేరకు ఎస్పీ జానకీషర్మిల బాసర జోన్ డీఐజీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఏఎస్సైని సస్పెండ్ చేస్తున్నట్టు డీఐజీ ప్రకటించారు.
రైతుపై పోలీసుల కర్కశత్వాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. రేవంత్ సర్కారుపై ఘాటు విమర్శలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతులను పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా చోట్ల రైతులపై పోలీసుల దౌర్జన్యాలు పెరిగిపోయాయని, ఓ పేద వృద్ధరైతు తన భూసమస్యను వివరించేందుకు అధికారుల వద్దకు వస్తే కిరాతకంగా వ్యవహరించడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు. నాడు లగచర్ల, నేడు ఖానాపూర్‌లో రైతులను అవమానించారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రశ్నించేవారందరి గొంతులను పోలీసుల ద్వారా అణగదొక్కించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని, ఎక్కడ కూడా రైతులకు, సాధారణ ప్రజలకు తమ అభిప్రాయాలను చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.
రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలనా కాదని, రాక్షస పాలన అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకునే రైతు రాజ్యమంటే ఇదేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు భరోసా లేక మనో ధైర్యం కోల్పోతున్నారని దుయ్యబట్టారు. అన్నం పెట్టే అన్నదాతకు కాంగ్రెస్ పార్టీ సున్నం పెడుతున్నదని, నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచి, నమ్మక ద్రోహం చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.