రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా.. అన్న రాజుల కాలంనాటి సామెతను.. నేడు రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి సర్కార్ నిజం చేస్తున్నది. దశాబ్దాలుగా రైతుల సాగులో ఉన్న ఎనికెపల్లి భూములను ప్రభుత్వం గోశాలకు కేటాయించాలని భావించింది. అనుకున్నదే తడవుగా కలెక్టర్, ఆర్డీవో, హెచ్ఎండీఏ అధికారులను మంగళవారమే పరిశీలనకు పురమాయించింది.
జీవనాధారమైన భూములను లాక్కొని తమ పొట్టలు కొట్టొద్దని నిరుపేద రైతులు వారి ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. ఆ మరునాడే అంటే బుధవారమే రెవెన్యూ అధికారులు ఆయా భూముల్లో పోలీసులను కాపలా ఉంచారు. తన పొలంలో దున్నుకుంటున్న ఓ రైతును పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మొయినాబాద్, జూన్ 4: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికెపల్లి నిరుపేద దళిత, బడుగు రైతుల భూవివాదం రగులుతున్నది. రెవెన్యూ అధికారుల హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది. బుధవారం బాధిత రైతులతో రెవెన్యూ అధికారులు సమీక్ష నిర్వహించారు. 180 సర్వేనంబర్‌లో ఉన్న 99.14 ఎకరాలు ముమ్మాటికీ ప్రభుత్వ భూములేనని, సాగు చేసుకుంటున్న రైతుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో లేవని, ఆ భూములపై రైతులు తమ ఆశ వదులుకోవాల్సిందేనని ఆర్డీవో చంద్రకళ స్పష్టంచేశారు. దీంతో నిరుపేద రైతులు రగిలిపోతున్నారు. ఎనికెపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని 180 సర్వేనంబర్‌లో 99.14 ఎకరాల భూమిని 50 మంది దళిత, బడుగు బలహీనవర్గాల రైతులు సాగు చేసుకుంటున్నారు.
దశాబ్దాలుగా వారు సాగు చేసుకుంటున్న ఆ భూములపై రేవంత్ సర్కార్ కన్నుపడింది. విలువైన ఆ భూములను ప్రైవేటు గోశాలకు కేటాయించాలని ప్రభుత్వం భావించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తోపాటు హెచ్ఎండీఏ కమిషనర్ ఇతర అధికారులు మంగళవారం ఆ భూములను పరిశీలించేందుకు వచ్చారు. ఈ సమయంలో బాధిత రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ప్రభుత్వ తీరును తీవ్రంగా నిరసించారు. తాతలు, తండ్రుల నుంచి తాము ఆ భూములే ఆధారంగా బతుకుతున్నామని, తమ భూములు లాక్కొని తమ పొట్టలు కొట్టొద్దని రైతు కుటుంబాలు కలెక్టర్ బృందం వద్ద తమ గోడు వెల్లబోసుకున్నాయి.
తమ ప్రాణాలు పోయినా భూములను ఇవ్వబోమని తెగేసి చెప్పారు. తమ శవాల మీద గోశాల ఏర్పాటు చేయండి.. అంటూ తీవ్రస్థాయిలో నిరసనను వ్యక్తంచేశారు. దీంతో వెనక్కి తగ్గిన అధికారులు.. ఆర్డీవో కార్యాలయంలో ఆ భూముల ఫిర్యాదులు అందజేయాలంటూ రైతులకు సూచించారు. ఇదిలా ఉండగానే, ఆ భూములలోనికి రైతులెవరినీ రానివ్వకుండా ప్రభుత్వం పోలీసులను కాపలా పెట్టింది. ఆ భూముల జోలికి రావద్దంటూ బుధవారం పోలీసులు పహారా కాశారు.
ఇదేరోజు భూమిని దున్నుకుంటున్న ఓ రైతును పోలీసులు అరెస్ట్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించడంపై బీఆర్ఎస్, సీపీఎం నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం దమననీతికి పాల్పడుతుందని ఆయా పార్టీలు మండిపడ్డాయి. బాధిత రైతులకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్, సీపీఎం నేతలు, భూములను పరిశీలించి రైతుల్లో మనోధైర్యం కల్పించారు.
ఎనికెపల్లి రెవెన్యూ పరిధిలో బడుగు, బలహీనవర్గాల ప్రజలు సాగుచేసుకుంటున్న భూముల్లో ప్రభుత్వ భూమి ఉన్నట్టు ఆరు నెలల క్రితమే బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ భూములను గోశాలకు ప్రభుత్వం కేటాయించినట్టు అప్పట్లోనే రెవెన్యూ అధికారులు చెప్పారు. దీంతో ఆందోళన చెందిన రైతులు తమ భూములను కాపాడాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యను కలిసి వేడుకున్నారు.
ఈ మేరకు స్పందించిన ఆయన ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని, భూములను సాగు చేసుకోమని బాధిత రైతులకు సూచించారు. ఆయన హామీతో భూములను సాగుచేసుకుంటుండగా, ఉన్నట్టుండి అధికారులు భూముల వద్దకు రావడంతో వారిలో ఆందోళన మొదలైంది. సీఎం దృష్టికి తీసుకెళ్లి తమ భూములను కాపాడుతానని ఎమ్మెల్యే ఇచ్చిన హామీ ఏమైనట్టు అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అధికారులు భయబ్రాంతులకు గురిచేస్తుంటే ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తున్నారు.
దశాబ్దాలుగా నుంచి బడుగు బలహీనవర్గాల కుటుంబాలు సాగుచేసుకొని జీవనాధారం పొందుతున్న భూములను ప్రైవేటు గోశాలకు కేటాయించడంలో అంతర్యమేమిటని సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగల్ల భాస్కర్, చేవెళ్ల డివిజన్ కార్యదర్శి పల్లి దేవేందర్ అనుమానం వ్యక్తంచేశారు. సీపీఎం బృందం ఎనికెపల్లి భూములను బుధవారం పరిశీలించి రైతుల పక్షాన నిరసన వ్యక్తంచేశారు.
అనంతరం భాస్కర్, దేవేందర్ మాట్లాడారు. 7 దశాబ్దాలుగా ఆ భూములను నిరుపేద కుటుంబా సాగు చేసుకుంటున్నాయని, భూమి శిస్తు కూడా చెల్లించాయని తెలిపారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులతో గ్రామసభను ఏర్పాటు చేసి రైతుల అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు. అలాకాకుండా ఆ భూములను ప్రభుత్వం గోశాలకు కేటాయించిందని కలెక్టర్, రెవెన్యూ అధికారులు రైతులను భయభ్రాంతులకు గురి చేయడమేమిటని మండిపడ్డారు. ఆ భూములను రైతుల నుంచి లాక్కనే ప్రయత్నం చేస్తే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఎనికెపల్లి గ్రామ రెవెన్యూలోని 180 సర్వేనంబర్‌లో ఉన్న 99.14 ఎకరాలు ముమ్మాటికీ ప్రభుత్వ భూములేనని చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ స్పష్టంచేశారు. సాగు చేసుకుంటున్న రైతుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో లేవని, ఆ భూములపై రైతులు తమ ఆశలు వదులుకోవాలని, ఎలాంటి న్యాయం కావాలో ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం గోశాలకు కేటాయించే విషయంపై రైతుల అభ్యంతరాలతో బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో అధికారులు సమీక్ష నిర్వహించారు. గోశాలకు కేటాయించిన భూములపై చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్‌కుమార్, ఏసీపీ కిషన్ సమక్షంలో చర్చలు జరిపారు.
దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని రైతులు ఆర్డీవోకు విజ్ఞప్తిచేశారు. నిరుపేద కుటుంబాలే ఆ భూములను సాగుచేసుకొని బతుకుతున్నట్టు తెలిపారు. ఆ భూములు తప్ప ఇతర ప్రతిపాదనలు పెట్టాలని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీవో చెప్పారు. ఎట్టి పరిస్థితిలో ఆ భూములు రైతులకు చెందవని తేల్చి చెప్పారు. వేరే ప్రతిపాదనలను సిద్ధం చేసుకుంటే మరోసారి చర్చిద్దామని చెప్పడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
బడాబాబుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను ప్రభుత్వం గుంజుకొని గోశాలకు ఇవ్వాలి. కానీ, ఆ భూములను ఆధారం చేసుకొని పొట్టపోసుకుంటున్న బడుగు జీవుల భూములను లాక్కోవడం అన్యాయం. గోశాల ఏర్పాటుకు అనువైన భూములు ఇతర ప్రాంతాల్లో అనువుగా ఉన్నాయి. పేదల భూములపైకి ప్రభుత్వం రావడం అక్రమం. ఎనికెపల్లి నిరుపేద రైతుల భూములను లాక్కుంటే సహించేది లేదు.
– ఆంజనేయులు, బీఆర్ఎస్ చేవెళ్ల నియోజకవర్గ నేత