Harish Rao | మెదక్ : వేములవాడ రాజన్న దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
వారం రోజుల్లో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. రోజూ కోడెలు చనిపోతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోగా, కనీస స్పందన కూడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం కోడెలకు గడ్డిపెట్టే పరిస్థితి లేదా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం. కలెక్టర్, అధికారులు, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ ఏం చేస్తున్నట్టు? అని హరీశ్‌రావు నిలదీశారు.
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థాన పరిస్థితి ఇలా ఉంటే ఎలా? కోడెలను కాపాడలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాకపోతే చెప్పండి. బీఆర్ఎస్ పార్టీకి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండి. మీకు ప్రజలు అంటే లెక్కలేదు. దేవుళ్ళంటే లెక్కలేదు అని కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్ రావు మండిపడ్డారు.