మరిపెడ/దామెర, ఫిబ్రవరి 22 : విద్యుదాఘాతానికి ఇద్దరు రైతులు బలయ్యారు. ఈ ఘటనలు మహబూబాబాద్, హనుమకొండ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కొటియాతండాకు చెందిన రైతు తేజావత్ హేమ (65) ఆదివారం ఉదయం పొలానికి వెళ్లాడు. నీళ్లు పెట్టేందుకు మోటర్ స్విచ్ ఆన్ చేస్తున్న క్రమంలో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన రైతు సోమన్న మృతుడిని కాపాడబోయి తానుకూడా కరెంట్ షాక్కు గురికాగా, స్థానికులు అతడిని మహబూబాబాద్ ఏరియా దవాఖానకు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
కాగా హనుమకొండ జిల్లా దామెర మండలం సింగరాజుపల్లిలో కరెంట్ షాక్తో రైతు మరణించాడు. ఒడ్డేపల్లి సదయ్య తన వరి పొలానికి నీరు పెట్టాలని ఇదే గ్రామానికి చెందిన రైతు ఒడ్డేపల్లి మొగిళి (62)కి చెప్పాడు. శనివారం మొగిళి పొలానికి వెళ్లాడు. నీరు పారిస్తూ, ఒడ్డుపై ఉన్న గడ్డి కోస్తుండగా పక్కనే ఉన్న కరెంటు మోటర్ సర్వీసు వైర్ తగిలి షాక్ కొట్టడంతో మొగిళి అక్కడికక్కడే మృతిచెందాడు.