న్యూఢిల్లీ, ఆగస్టు 10: బంగారం ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడం, రూపాయి మరింత బలహీనపడుతుండటంతో అతి విలువైన లోహాల ధరలు దూసుకుపోతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర మరో రూ.2 వేలు ఎగబాకి రూ.1.56 లక్షలకు చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.1.54 లక్షలుగా ఉన్నది. వరుసగా ఐదోరోజూ ధరలు పెరుగడం విశేషమని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ దేశీయంగా ధరలు మాత్రం పుంజుకోవడం విశేషమని ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. దీంతో ధరలు పుంజుకుంటున్న ప్రస్తుత తరుణంలో పెట్టుబడిదారులు వేచిచూసే దోరణి అవలంబిస్తున్నారని పేర్కొన్నారు.
పసిడితోపాటు వెండి పరుగులు పెట్టింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.5 వేలకు పైగా ఎగబాకింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి కిలో వెండి రూ.5,200 అధికమై రూ.2,40,000 పలికింది. గతవారాంతానికిగాను ధర రూ.2,34,800గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,335.32 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి 63.90 డాలర్ల వద్ద ఉన్నది. అమెరికా ద్రవ్యోల్బణ నివేదిక ఈ వారంలోనే విడుదల కానుండటంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌నకు మొగ్గుచూపడం ధరలు ఏడు వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని లెమనన్ మార్కెట్స్ డెస్క్ రీసర్చ్ హెడ్ గౌరవ్ గార్గ్ తెలిపారు.
దేశీయ కరెన్సీ విలువ మరింత బక్కచిక్కుతున్నది. దీంతో దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ఇంధనం, బంగారం, ఇతర దిగమతు చేసుకునే ఆహార పదార్థాల కోసం అధికంగా నిధులు వెచ్చించాల్సి వస్తుండటంతో వీటి ధరలు రివ్వున ఎగుస్తున్నాయి. ఇప్పటికే ఇంధన ధరలు గరిష్ఠ స్థాయిలోనే కదలాడుతుండగా, తాజాగా బంగారం ధరలు భారీగా పుంజుకుంటున్నాయని విశ్లేషకులు వెల్లడించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 11 పైసలు పడిపోయి 95.28 వద్దకు జారుకున్నది. స్వల్పంగా వెనక్కి తగ్గినప్పటికీ, ఫెడరల్ రిజర్వు దూకుడిగా వ్యవహరిస్తున్నదనే అంచనాలు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బులియన్ మద్దతు లభించిందన్నారు. చమురు ధరలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.