పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బుల్లేవంటరు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్, రైతులకు రైతుబంధు అడిగితే డబ్బుల్లేవంటరు. పైసల్లేకుంటే జూబ్లీహిల్స్‌లో రూ.100 కోట్లతో సీఎం క్యాంప్ ఆఫీస్, రూ. 5 కోట్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమారకు మూడో క్యాంపు ఆఫీస్ కట్టుకోవడానికి ఎకడి నుంచి తెస్తున్నరు? ఇప్పుడు ఎవరి జేబులు నింపడానికి మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెడుతున్నరు?
-హరీశ్‌రావు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : మూసీ సుందరీకరణ అని చెప్పి సీఎం రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని, ఆయన వేసే ప్రతి అడుగు పేదల భూములు లాక్కోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపా రం చేయడం వైపే ఉంటుందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరిట హైదరాబాద్ హైదర్షాకోట్లోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ నివాసితులను ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన క్రమంలో వారికి ఆదివారం వారిని కలిసి భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తీక్ రెడ్డితో కలిసి అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక వందలాది మంది ఇండ్లు కూలగొట్టి వారిని రోడ్డున పడేసిందని, ఇంకెంతమంది బతుకులను కూలుస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేసీఆర్ ఎప్పుడూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎలా పెంచాలి? ప్రజలకు ఎలా మేలు చేయాలి? అని ఆలోచించారని గుర్తుచేశారు. ‘మధు పార్క్ అపార్ట్‌మెంట్‌ను నిలబెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తే రేవంత్ రెడ్డి మాత్రం బుల్డోజర్లతో కూల్చే ప్రయత్నం చేస్తున్నడు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ ప్రక్షాళనపై కనీస పాలసీ, విధానం లేదు.. పూటకో తీరుగా వ్యవహరిస్తున్నది’ అని దుయ్యబట్టారు. మూసీని శుద్ధి చేయాలని అందరూ కోరుకుంటారని, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అప్పట్లోనే రూ.3,800 కోట్లతో ఎస్టీపీలు నిర్మించి నీటి శుద్ధీకరణ ప్రారంభించిందని గుర్తుచేశారు. కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు తెచ్చి మూసీలో వదిలేందుకు డీపీఆర్‌లను కూడా కేసీఆర్ ప్రభుత్వం తయారు చేయించిందని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి నాడు ఏ ఒక ఇల్లూ కూల్చే ఆలోచన రాలేదని చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, అప్పుడు ఒక ఇల్లు కూడా కూల్చకుండా మూసీని బాగు చేసి చూపిస్తామని స్పష్టంచేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏది చేసినా దాని వెనుక కచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారమే ఉంటుందని హరీశ్ తెలిపారు. భూముల పంచాయితీలు, రియల్ ఎస్టేట్ దోపిడీ తప్ప రెండేండ్లతో రేవంత్‌రెడ్డి చేసిందేమీ లేదని చెప్పారు. ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు గుంజుకుందామని ప్రయత్నిస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని గుర్తుచేశారు.
ఎల్టీపీఎస్ భూములు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ప్రయత్నించారని, ఫార్మాసిటీ కోసం కేసీఆర్ 14,000 ఎకరాలు సేకరిస్తే ఆ భూములపై ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరిట పేద, మధ్య తరగతి ప్రజల ఇండ్లు కూల్చి, భూములు లాకొని వాటిని అంబానీకో, అదానీకో, మేఘా కృష్ణారెడ్డికో కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో కట్టిన ఒక్క ఇల్లూ లేదు కానీ కూల్చిన బతుకులు, కూల్చిన ఇండ్లు వందలాదిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మూసీ సుందరీకరణ పేరిట వేలాది మంది సొంతింటి కలను సీఎం రేవంత్‌రెడ్డి కాలరాస్తున్నాడని హరీశ్ మండిపడ్డారు. ‘బాపు ఘాట్ వద్ద అహింసామూర్తి మహాత్మా గాంధీ విగ్రహం పెట్టి ఆరాధించాలి కానీ ఆ విగ్రహం, నిర్మాణం పేరిట ప్రజల ఇండ్లు కూల్చుతూ, హింసాత్మక మార్గంలో భయాందోళనలకు గురిచేయడం దుర్మార్గం’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
‘ఇండ్లు ఖాళీ చేస్తారా, లేకుంటే బుల్డోజర్లు పంపి కూల్చుమంటారా?’ అని అధికారులు బెదిరిస్తున్నరు. రేవంత్ రెడ్డికి మధు పార్క్ రిడ్జ్ అపార్ట్ మెంట్ అంటే కేవలం ఇటుకలు, సిమెంట్ మాత్రమే కావచ్చు. కానీ ఒక మధ్యతరగతి వాడికి రెకలు ముకలు చేసుకుని, బ్యాంకుల చుట్టూ తిరిగి అప్పులు తెచ్చుకుని కట్టుకున్న జీవితకాలపు సొంతింటి కల.. ఇండ్లు కూల్చడమంటే ఇకడి బతుకులను కూల్చడమే. పసిపిల్లలు కంటిమీద కునుకు లేకుండా రాబోయే పరీక్షలు ఎట్ల రాస్తరు? రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లో రూ.100 కోట్లతో ప్యాలెస్ కట్టుకుని ఉంటున్నరు. ఆయనకు ఇక్కడి ప్రజల బాధలు ఏం తెలుస్తయి?’ అని నిలదీశారు. ఇప్పటివరకు మూసీ డీపీఆర్, ఎఫ్టీఎల్ ఖరారు కాలేదని గుర్తుచేశారు.
ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలేదని, కనీసం సోషల్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ కూడా జరగలేదని, అలాంటప్పుడు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మూసీ శుద్ధికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని, ఎస్టీపీలు కట్టి మురుగునీరు రాకుండా చేయాలని హితవు పలికారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం పైపులైన్లతో గోదావరి నీళ్లు తెచ్చి మూసీని శుద్ధి చెయాలి కానీ మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు కూల్చడం ఎంతమాత్రం సమంజసం కాదని స్పష్టంచేశారు.
‘కాంగ్రెస్ వచ్చిన తర్వాత భూముల రేట్లు పాతాళానికి పడిపోయినయ్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది. ఎకడ చూసి నా దోపిడీ మాత్రమే కనిపిస్తున్నది. హైడ్రా ముసుగులో దోపిడీ, మూసీ ప్రాజెక్టు విషయంలో దోపిడీ, ఫ్యూచర్ సిటీ పేరిట, సెంట్రల్ యూనివర్సిటీ భూముల పేరిట, భూముల అమ్మకాల పేరిట అంతా దోపిడీ. మేం కేవలం రాజకీయాల కోసం కాదు, ప్రజల కోసం, హై దరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమే మాట్లాడుతున్నం. ప్రభుత్వం పట్టింపులకు పోకుండామధు పార్ అపార్ట్‌మెంట్‌కు ఇచ్చిన నోటీసులను బేషరతుగా వెనకి తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
‘పకనున్న ప్రభుత్వ స్థలాల్ని డెవలప్ చేసుకోండి. మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను ఛిద్రం చేయకండి’ అని హితవుపలికారు. ‘మా ఇండ్లు కూలగొట్టే బదులు.. మా నీళ్ల ట్యాంకులో విషం కలిపితే మేమంతా తాగి సచ్చిపోతం.. మమ్మల్ని చంపండి’ అని ఇకడ ఒక తల్లి అన్న మాట నన్ను ఎంతగానో కలచివేసింది. మీరెవరూ ఆందోళన చెందకండి.. భయపడకండి. రేపు జరిగే అసెంబ్లీసమావేశాల్లో చర్చకు డిమాండ్ చేస్తం. ఈ అక్రమాలపై ఎంత దూరమైనా వెళ్తాం. బీఆర్ఎస్, కేసీఆర్ పక్షాన మీకు అండగా నిలబడి, చట్టపరంగా పూర్తి స్థాయి పోరాటం చేస్తాం’ అని భరోసా ఇచ్చారు.
మధు పార్క్ రిడ్జ్‌తో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రత్యేక అనుబంధం ఉన్నదని హరీశ్ వెల్లడించారు. మధు పార్క్ రిడ్జ్ నివాసితులకు అండగా ఉండాలని కేసీఆర్ తమను ఇకడికి పంపారని చెప్పారు. కేసీఆర్‌కు మధు పార్ అపార్ట్‌మెంట్‌కు మూడుసార్లు వచ్చారని గుర్తు చేశారు. నాడు బీఆర్ఎస్ పాలసీ విజన్ డాక్యుమెంట్‌ను ఇకడి వార్ రూముల్లో కూర్చునే తయారు చేశారని చెప్పారు.
ఆపార్ట్‌మెంట్‌లో మంచినీళ్లు రావట్లేదని, అపార్ట్మెంట్ ఖాళీ చేయాల్సిన దుస్థితి ఉన్నదంటే కేసీఆర్ సీఎం అయ్యాక వెంటనే మంచినీళ్ల పైప్‌లైన్ వేయించారని, అప్పటికప్పుడు జలమండలి అధికారులను ఆదేశించి ప్రత్యేక పైపులైన్ వేయించారని గుర్తుచేశారు. అప్పటి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డితో బటన్ ఆన్ చేయించి మరీ నీళ్లు ఇచ్చారని తెలిపారు. అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అపార్ట్మెంట్ వాసులు అడగగానే రాత్రికి రాత్రే రోడ్డు వేయించారని చెప్పారు. నాడు మూసీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న సుధీర్‌రెడ్డి మూసీని శుద్ధి చేయించి అపార్ట్‌మెంట్‌వాసులకు దోమల బెడద లేకుండా చేశారని గుర్తుచేశారు.
కచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారమే ఉంటది. ముఖ్యమంత్రిగా ఆయన వేసే ప్రతి అడుగులో భూముల పంచాయితీ, రియల్ ఎస్టేట్ దోపిడీ దాగి ఉంటది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్ల నుంచి రేవంత్‌రెడ్డి చేసిందంతా అదే. ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్‌లో కట్టిన ఒక్క ఇల్లూ లేదు కానీ కూల్చిన బతుకులు వందలాదిగా ఉన్నయి.
-హరీశ్‌రావు
రెండేండ్లుగా అన్ని వర్గాలను మోసం చేయడమే తప్ప కాంగ్రెస్ ఒక్క మంచి పని కూడా చేయలేదని హరీశ్ విమర్శించారు. రాష్ట్ర ఖజానాలో డబ్బుల్లేవంటూనే స్వప్రయోజనాలకు రూ.వేల కోట్లు దుబారా చేస్తున్నారని మండిపడ్డారు. ‘పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వుమంటే డబ్బుల్లేవంటరు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్, రైతులకు రైతుబంధు అడిగితే డబ్బుల్లేవంటరు. గురుకులాల్లో సరైన వసతులు కల్పించక, నాణ్యమైన భోజనం పెట్టక 162 మంది విద్యార్థులు సచ్చిపోయిండ్రు.
ఇదేంటని ప్రశ్నిస్తే రాష్ట్రం దివాలా తీసిందంటరు. ‘నా దగ్గర పైసల్లేవు.. నన్ను కోసుక తింటారా?’ అంటున్నరు. మరి మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్, మిస్ వరల్డ్ పోటీలకు రూ.వందల కోట్లు ఎకడి నుంచి వచ్చినయి? జూబ్లీహిల్స్‌లో రూ.100 కోట్లతో సీఎం క్యాంపు ఆఫీస్, రూ.5 కోట్లతో డిప్యూ టీ సీఎం భట్టి విక్రమారకు మూడో క్యాంపు ఆఫీస్ కట్టుకోవడానికి పైసలు ఎకడివి? బడా కాంట్రాక్టర్లకు రూ.20,000 కోట్ల బిల్లులు ఎట్ల ఇచ్చిం డ్రు? ఇప్పుడు ఎవరి జేబులు నింపడానికి మూసీ ప్రాజెక్టు పేరుతో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెడుతున్నరు? ఈ డబ్బులన్నీ ఎకడి నుంచి వసున్నయి?’ అంటూ నిలదీశారు.