వేల్పూర్, ఫిబ్రవరి 22 : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. రైతుల సమస్యలపై పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ నిరుడు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్‌రోడ్డు వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని సాకుగా చూపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 44 మంది బీఆర్ఎస్ నాయకులు, రైతులపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని అన్నారు. ఈ అక్రమ కేసులను నిరసిస్తూ వేల్పూర్‌లో ఆదివారం వేముల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నల్ల జెండాలు, నల్ల దుస్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రైతులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. రైతులతో కలిసి ఎస్సై సంజీవ్ నుంచి నోటీసులు అందుకున్నారు.
ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ పోలీసులు పెట్టిన అక్రమ కేసులపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. నాడు నిరసన కార్యక్రమానికి పోలీసుల అనుమతి తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ హామీని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. బాల్కొండ నియోజకవర్గంలో 53 వేల మందికి రుణమాఫీ కావాల్సి ఉండగా, కేవలం 22 వేల మందికే చేసి మిగితా 31 వేల మందిని మోసం చేశారని మండిపడ్డారు. ఐదు సీజన్లకుగాను 3 సీజన్లు రైతుబంధు ఎగ్గొట్టారని విమర్శించారు.
వడ్లకు రూ.500 బోనస్ అరకొరగా వేస్తున్నారని ఆయన ఆరోపించారు. నాడు పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎరువులు రైతుల ముంగిట ఉండేవని, నేడు కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. స్మార్ట్ ఫోన్లు వాడటం రాని రైతులపై యాప్ నిబంధనలు రుద్ది వేధిస్తున్నారని మండిపడ్డారు. దుకాణాల్లో దొరికే యూరియాను యాప్ ద్వారా తీసుకొవాలంటూ వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. షాపులో లేని యూరియా యాప్‌లో ఉంటుందా? అని ఈ సందర్భంగా వేముల ప్రశ్నించారు.

గతంలో ఆంధ్రా పాలకుల హయాంలో కూడా లేని విధంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల సమస్యలపై పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్నదని ఆయన మండిపడ్డారు. భీమ్‌గల్‌లో తులం బంగారం ఇవ్వాలని నిరసన తెలియజేస్తే 40 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించారని గుర్తుచేశారు. అక్రమ కేసులు వేధింపులతో తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
2024 డిసెంబర్ 18న ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వంటి వారు రాజ్‌భవన్ ఎదుట రోడ్డుపై ధర్నా చేసిన ఫొటోను వేముల మీడియాకు చూపిస్తూ.. నాడు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన రేవంత్‌రెడ్డిపై లేని కేసులు, అనుమతి తీసుకుని శాంతియుతంగా నిరసన తెలిపిన తమపై ఎందుకు ? అని డీజీపీని ప్రశ్నించారు. పోలీస్ మ్యానువల్ ప్రకారం వ్యవహరిస్తామని చెప్తున్న డీజీపీ శివధర్‌రెడ్డి నాడు రేవంత్‌రెడ్డి చేసిన ధర్నాపై కేసులు నమోదు చేశారా అని వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు.