పెన్పహాడ్, ఆగస్టు 06 : పెన్పహాడ్ మండల పోలీస్ స్టేషన్ను సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్ నందు నిర్వహిస్తున్న పోలీస్ రోల్ కాల్ కు హాజరై పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది క్రమశిక్షణ, బాధ్యతతో ఉండి నేరాలను అరికడుతూ ప్రజలకు, బాధితులకు పోలీసు సేవలు వేగంగా అందించాలని సూచించారు, గ్రామ పోలీసు అధికారి బాధ్యత పని చేయాలని గ్రామాలను సందర్శిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలన్నారు. గ్రామాల్లో ఏదైనా సమస్య ఉన్న, ఏవైనా అసాంఘిక చర్యలు, అక్రమ రవాణా జరిగిన వెంటనే సమాచారం సేకరించే విధానంగా సమాచార వనరులను బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించారు. స్టేషన్ లోని రిసెప్షన్ సెంటర్, ఫిర్యాదుల నిర్వహణ రికార్డులను తనిఖీ చేసి, స్టేషన్ కు వచ్చిన పిర్యాదుదారులతో మాట్లాడి అందుతున్న సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కేసుల దర్యాప్తు తీరు, ఫిర్యాదులపై సిబ్బంది స్పందిస్తున్న విధానాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా సిబ్బందికి ఎస్పీ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మండల పరిధిలో ఎలాంటి అక్రమ రవాణా సాగినా, అసాంఘిక కార్యకలాపాలు జరిగినా కఠిన చర్యలు తీసుకోవాలి. గంజాయి సరఫరా అవకుండా గంజాయి వినియోగించకుండా పాత నేరస్థులపై నిఘా కట్టుదిట్టం చేయాలని సూచించారు. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. సమాజంలో మహిళల రక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. మండలంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ముందస్తు ప్రణాళికలతో క్షేత్రస్థాయిలో పని చేయాలని, , నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ భద్రత కల్పించాలన్నారు. సామాజిక అంశాలు, సైబర్ నేరాలు, ఇతర చట్టాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహన సదస్సులు నిర్వహించాలని పేర్కొన్నారు.