కోదాడ, ఆగస్టు 06 : తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ జయంతి వేడుకలు గురువారం కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నేతృత్వంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి రాష్ట్ర ఆవిర్భావానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కోదాడలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు నయీమ్ మాట్లాడుతూ.. సార్ స్ఫూర్తితోనే ఉద్యమ నేత కేసీఆర్ సారధ్యంలోతెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మూడు తరాల ఉద్యమాలలో జయశంకర్ పాత్ర ఉందన్నారు. ఆయన ఆశయాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కె.బాబు, కరీముల్లా, బాబా, భాగ్యమ్మ, అబ్బు, ఉపేందర్ గౌడ్, వేణుగోపాల్, మల్లయ్య, మజార్, వీరాచారి, పాషా, నిస్సార్, జానీ, గోపి, శ్రీను పాల్గొన్నారు.
ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెస్ కళాశాలలో జయశంకర్ సార్ జయంతిని, ప్రజాయుద్ధ నౌక గద్దర్ వర్ధంతిని పురస్కరించుకుని వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేదిక కన్వీనర్ రాయపూడి చిన్ని మాట్లాడుతూ… రాష్ట్ర ఆవిర్భావం కోసం జయశంకర్ సార్ తన జీవితాంతం కృషి చేశారన్నారు. ఆయన సిద్ధాంతాల ఆచరణతోనే సబ్బండ వర్గాలు ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. కాగా తెలంగాణ ఉద్యమంతో పాటు పౌర హక్కుల సాధనకు గద్దర్ చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వేదిక సభ్యులు పందిరి నాగిరెడ్డి, రాఘవరెడ్డి, నరసింహారావు, ఉదయగిరి, జి.ఎల్.ఎన్.రెడ్డి, ఎస్ఎస్ రావు, హరికిషన్ రావు, రామనరసయ్య, పెయింటర్ బాబు, అప్పిరెడ్డి, గోపి రాథోడ్, బాలు నాయక్ పాల్గొన్నారు.

‘జయశంకర్ సార్ స్ఫూర్తితోనే రాష్ట్ర సాధన’