గురుగ్రామ్, ఫిబ్రవరి 22: బీజేపీ పాలిత హర్యానాలో దారుణం జరిగింది. తనతో సహ జీవనం చేస్తున్న ఒక విద్యార్థినిని ఆమె భాగస్వామి తరచూ హింసించడమే కాక, ఆమె ప్రైవేట్ పార్టులపై సానిటైజర్ పోసి నిప్పంటించిన ఘటన గురుగ్రామ్‌లో జరిగింది. దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితురాలి ఆరోగ్యం విషమంగా ఉంది. నిందితుడు శివమ్‌ను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. త్రిపురకు చెందిన ఓ యువతి(19) బీఎస్సీ చదువుతూ గురుగ్రామ్‌లో మొదట ఒక వసతి గృహంలో ఉండేది. ఒక ఆన్లైన్ యాప్ ద్వారా ఆమెకు ఢిల్లీ కుర్రాడు శివమ్ పరిచయం అయ్యాడు.
అది కాస్త ప్రేమగా మారింది. ఆమెను పెండ్లి చేసుకుంటానని శివమ్ హామీ ఇచ్చాడు. దీంతో నిరుడు సెప్టెంబర్ నుంచి ఇద్దరూ సహ జీవనం చేస్తున్నారు. ఇటీవల శివమ్‌కు ప్రియురాలిపై అనుమానం ఏర్పడి ఆమెను హింసించడం ప్రారంభించాడు. ఈ నెల 16న ఇద్దరి మధ్య వివాహం విషయమై జరిగిన వాదనలో ఆమెను అతడు తీవ్రంగా కొట్టి, ఆమె ప్రైవేట్ భాగాలపై శానిటైజర్ పోసి నిప్పంటించి ఆమెను తగలబెట్టడానికి ప్రయత్నించాడు. ఆమె కాళ్లపై కత్తితో గాయపరిచి, భవిష్యత్తులో నడవకుండా చేస్తానని బెదిరించాడు. ఈ నెల 18న అతడు ఆమె నగ్న వీడియోలను రికార్డు చేయడంతో బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. ఆమె వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే స్పందించి బాధితురాలిని రక్షించారు.
న్యూఢిల్లీ: బీజేపీ పాలిత ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఏడో తరగతి చదువుతున్న బాలికపై నలుగురు ప్రైవేట్ ఉపాధ్యాయులతో పాటు ఫ్యూన్ ఏడాది పాటు అత్యాచారానికి పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులందరినీ పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాలిక తనపై జరిగిన దారుణాన్ని గత నెలలో తన తల్లికి చెప్పింది.
దీంతో ఆమె కుటుంబం ఈ నెల 18న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ)లో ఫిర్యాదు చేశారు. అధికారులు పాఠశాలకు వెళ్లి విచారణ చేశారు. ఈ విచారణలో నిందితులను కాపాడటానికి ఒక మహిళతోపాటు కొంతమంది ఉపాధ్యాయులు ప్రయత్నించారు. బాధితురాలి కుటుంబం సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేశాకే తనకు విషయం తెలిసిందని, పూర్తి విచారణ తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తాయని పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు.