శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 19:10:55

కేసీఆర్ పాల‌నాద‌క్షుడు.. సంపూర్ణ మ‌ద్ద‌తునిస్తా : గ‌ద్ద‌ర్‌

కేసీఆర్ పాల‌నాద‌క్షుడు.. సంపూర్ణ మ‌ద్ద‌తునిస్తా : గ‌ద్ద‌ర్‌

హైద‌రాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప ప్రజా నాయకులు, పాలనాదక్షులని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. దేశ రాజకీయాల గతిని సమూలంగా  మార్చాల్సిన అవసరం ఉందని, ఇందుకు గాను కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే దానికి అనుబంధంగా కల్చరల్ ఫ్రంట్ పెట్టడం ద్వారా సంపూర్ణ మద్దతునిస్తానన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ వెంకటాపురం డివిజన్ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం గద్దర్‌ను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రితో గద్దర్ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ 14 రోజుల పాటు కఠోర దీక్ష చేసిన సందర్భాన్ని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌తో ముందుకువ‌స్తే దానికి అనుబంధంగా కల్చరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఆయనతో క‌లిసి ముందుకు సాగాలనేది తన అభిమతమన్నారు. కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని దాదాపు సగభాగం సస్యశ్యామలంగా మారిందన్నారు. రైతులు, ప్రజలు సంతోషిస్తున్నారని కొనియాడారు. టీఆర్ఎస్ కార్పోరేటర్‌గా వెంకటాపురం డివిజన్ నుంచి తిరిగి పోటీ చేస్తున్న సబితా కిశోర్‌ను గ‌ద్ద‌ర్ ఆశీర్వదించారు.