సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 02:35:58

ఈ చట్టం ప్రజల చుట్టం

ఈ చట్టం ప్రజల చుట్టం

  • నూతన రెవెన్యూ చట్టంలో నాలుగు కీలక మార్పులు
  • భూ చట్టాల నిపుణుడు ఎం సునీల్‌కుమార్‌ వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: చట్టం ప్రజల చుట్టం కావాలన్న సూత్రం నూతన రెవెన్యూ చట్టానికి సరిగ్గా సరిపోతుందని ప్రముఖ భూ చట్టాల నిపుణుడు ఎం సునీల్‌కుమార్‌ అన్నారు. కొత్త చట్టం ద్వారా ప్రభుత్వం చేసిన నాలుగు కీలకమైన మార్పులతో సామాన్యులకు, రైతులకు కొండంత ధైర్యం లభిస్తుందని తెలిపారు. కంప్యూటరీకరణ, భూమి చేతులు మారినపుడు చేయాల్సిన ప్రక్రియ, స్లాట్‌ బుకింగ్‌, వివాదాల పరిష్కారమే ప్రభుత్వం తీసుకొచ్చిన భారీ మార్పులని వెల్లడించారు. రికార్డులన్నీ కంప్యూటర్‌లో నిక్షిప్తం చేయడం వల్ల పాత రికార్డులను మార్చలేరని దాని వల్ల వివాదాలకు ఆస్కారముండదని పేర్కొన్నారు. ధరణిలో ఉన్న 1బీ రికార్డే ఫైనలవుతుందని చెప్పారు. పాత చట్టం ప్రకారం భూమి చేతులు మారాలంటే కనీసం రెండు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాల్సి ఉండేదని, కొత్త చట్టంలో ఇదంతా మార్చేసి సింగిల్‌ విండో పద్ధతిని తీసుకొచ్చారని ఆయన వివరించారు. 

వ్యవసాయ భూములైతే తాసిల్దారు, వ్యవసాయేతర భూములైతే సబ్‌ రిజిస్ట్రార్‌ వద్దకు వెళతారని, వారే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ చేసి కాగితాలు ఇస్తారన్నారు. 1బీ లోనూ వెంటనే మార్పులు జరుగుతాయని తెలిపారు. పాస్‌పోర్టు కోసం స్లాట్‌ బుక్‌ చేసుకున్నట్టుగానే ప్రజలకు వీలైన స్లాట్‌ బుక్‌ చేసుకుని వెళ్ళి రిజిస్ట్రేషన్‌ చేసుకొనే సదుపాయం కొత్త చట్టంలో కల్పించడం మంచి పరిణామమని సునీల్‌కుమార్‌ చెప్పారు. ఆర్వోఆర్‌ చట్టం కింద ఉన్న వివాదాలు, తప్పులను సరిదిద్దడమనే అధికారాలను రెవెన్యూ అధికారుల నుంచి తొలగించి ఆ కేసులన్నింటినీ ట్రిబ్యునళ్లకు అప్పగించడం వల్ల నిర్ణీత సమయంలో కేసులు పరిష్కారమవుతాయని తెలిపారు. 

మరిన్ని మార్పులు అవసరం

ఈ చట్టం మరింత సమర్థంగా సేవలందించాలంటే ధరణి వెబ్‌సైట్‌ను మరింత పకడ్బందీగా మార్చాలని సునీల్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు.  భూముల సర్వే చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. పెండింగు కేసుల కోసం ఏర్పాటు చేస్తున్న ట్రిబ్యునళ్లను పర్మినెంట్‌ చేస్తే బాగుంటుందని చెప్పారు. ట్రిబ్యునల్‌కు వెళ్ళిన పేదవారికి ఉచితంగా న్యాయసహాయం అందించాలని కోరారు. వ్యవసాయ భూమైనా, వ్యవసాయేతర భూమైనా ప్రజల చేతుల్లోకి వచ్చే పట్టాకు ప్రభుత్వమే జిమ్మేదార్‌గా ఉండేలా చట్టంలో ఉంటే చరిత్రలో తెలంగాణ పేరు శాశ్వతంగా ఉండిపోతుందని తెలిపారు.


logo