Andhrajyothy | మంచిర్యాల, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అది రూ.5 కోట్ల విలువైన భూమి.. కానీ, ఆ భూమిపై అవినీతి జరుగుతున్నదట.. అందులో ఏకంగా రూ.50 కోట్లు చేతులు మారాయట. అవును.. మీరు చదివేది నిజమే.. తెలంగాణ ప్రభుత్వంపై కచ్చతో కండ్లు మూసుకుపోయి కథనాలు వండివారుస్తున్న అంధజ్యోతికి అలాగే కనిపించింది మరి.. మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామంలో ‘అమ్మకానికి సొసైటీ భూములు’ శీర్షికన గురువారం ప్రచురించిన వార్తలో అర్థంపర్థంలేని లెక్కలతో లెక్కల గారడీ చేసేందుకు ప్రయత్నించింది.
అంధజ్యోతి మరోసారి బీఆర్ఎస్ పార్టీపై అక్కసును వెళ్లగక్కింది. పట్టా భూమిని దానం ఇచ్చారంటూ.. అందులో ప్లాట్లు చేసి విక్రయిస్తున్నట్టు.. అధికార పార్టీ నాయకులే ఇదంతా చేస్తున్నారంటూ.. ఎత్తుకున్న రాగానికి, పాడుతున్న పాటకు సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు పిచ్చిరాతలు రాసింది. అసలు విషయం ఏంటంటే.. ఇందారం గ్రామానికి చెందిన గోనె ఆండాళమ్మ జూన్ 2, 2003వ తేదీన మంచిర్యాల పట్టణానికి చెందిన శ్యాంసుందర్ అగర్వాల్‌కు సర్వే నంబర్ 191లోని 9.23 ఎకరాలు, సర్వే నంబర్ 192లోని 5.23 ఎకరాలు కలిపి మొత్తం 15.06 ఎకరాల పట్టా భూమిని విక్రయించారు. ఇందుకు సంబంధించి 3734/2003 నంబర్‌తో విక్రయ దస్తావేజు ఉన్నది. తన అక్కర నిమిత్తం ఈ భూమిని శ్యాంసుందర్ అగర్వాల్‌కు అమ్ముతున్నట్టు అందులో స్పష్టంగా తెలిపారు. అదే 192 సర్వే నంబర్లోని 2.20 ఎకరాల భూమిని మహేశ్ ఎడ్యుకేషనల్ సొసైటీకి దానమిస్తునట్టు 3733/2003 నంబర్‌తో దానపట్ట దస్తావేజు ఉన్నది. ఈ 2.20 ఎకరాలు ఇప్పటికీ ఆ సొసైటీ పేరు మీదే ఉన్నది. కానీ.. అంధజ్యోతి ఏకంగా డాక్యుమెంట్ నంబర్‌నే మార్చేసి 3733/2003 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో 15.06 ఎకరాల భూమి ఉన్నదని తన కథనంలో రాసింది. దాన్నే సొసైటీ తరఫున ఎవరో అమ్మకానికి పెట్టారని, అధికార పార్టీ నాయకులు ఆ భూమిని నామమాత్రపు ధరకు చేజిక్కించుకొన్నారని, ఓ స్థానిక నాయకుడి భార్యకు రెండెకరాలు ఇదే భూమిలో నుంచి విక్రయించారని వికృత రాతలు రాసింది.
మెడికల్ కాలేజీ ప్రస్తావనే లేని డాక్యుమెంట్
ఈ భూమిని మెడికల్ కాలేజీకి మహేశ్ ఎడ్యుకేషనల్ సొసైటీకి దానం ఇచ్చిన్నట్టు అంధజ్యోతి రాసింది. వాస్తవానికి డాక్యుమెంట్లో మెడికల్ కాలేజీ ప్రస్తావన ఎక్కడా లేదు. పేదలకు సహాయం అందిస్తున్న సొసైటీకి ప్రజోపయోగ కార్యక్రమాల కోసం ఈ 2.20 భూమిని ఉచితంగా ఇస్తున్నట్టు మాత్రమే అందులో ఉన్నది. దీన్ని పక్కనున్న 15.06 ఎకరాలకు ఆపాదించి సొసైటీ భూములు అంటూ అంధజ్యోతి అర్థం లేని వాదనకు తెరలేపింది. అసలు ఆ సొసైటీయే ప్రైవేటుది. అందులో శ్యాంసుందర్ అగర్వాల్ కుటుంబ సభ్యులే ఉన్నారు తప్పితే వేరే వారు ఎవరూ లేరు. పైవేటు సొసైటీకి ఇచ్చింది కాబట్టి దాన్ని అమ్ముకునే అధికారం వారికి ఉన్నది.
ఇందులో ఎలాంటి సందేహం లేదు. దానం ఇచ్చిన భూముల్లోనే ఆండాళమ్మ గడీ ఉన్నట్టు అంధజ్యోతి రాసింది. అది పచ్చి అబద్ధం. గడీ దానం ఇచ్చిన భూముల్లో లేదు. గోనె ఆండాళమ్మ భర్త గోనె వెంకట ముత్త్యంరావు నుంచి వారి కుమారుడు గోనె రాజసింహారావు పేరు మీదకు వచ్చింది. ఆయన మరణాంతరం ఆయన భార్య అరుణాదేవి పేరు మీదకు మారింది. ఇప్పటికీ ఆ గడి, దాని చుట్టూ ఉన్న భూమి అరుణాదేవి పేరు మీదనే ఉన్నది. అది వదిలేసి కొనుగోలు చేసిన పట్టా భూమి చుట్టూ మాత్రమే ప్రహరీ నిర్మించుకున్నారు. ఈ 15.06 ఎకరాల్లో రెండు ఎకరాలు రామారావుపేట గ్రామానికి చెందిన ముదాం రాజేశ్వరి, రమేశ్.. మిగిలిన 13 ఎకరాలు మంచిర్యాలకు చెందిన మరికొందరు శ్యాంసుందర్ అగర్వాల్ కొడుకు మహేశ్ అగర్వాల్ నుంచి కొనుగోలు చేశారు.
లెక్కల్లోనూ తప్పులే?
15 ఎకరాల భూమి ఎకరాకు రూ.50 లక్షల ధర పలుకుతున్నదని అంధజ్యోతి రాసింది. అదే వార్తలో రూ.50 కోట్లు చేతులు మారినట్టు పేర్కొంది. ఎకరాకు రూ.50 లక్షలు అంటే రూ.7.50 కోట్లే అవుతుంది. మరి రూ.7.50 కోట్లకు రూ.50 కోట్లు ఎలా చేతులు మారాయో అంధజ్యోతికే తెలియాలి. వాస్తవానికి ఇక్కడ ఎకరాకు రూ.30-35 లక్షలు మాత్రమే ఉన్నది. ఆ లెక్కన మొత్తం భూమికి రూ.5 కోట్లే అవుతాయి. కానీ, రూ.50 కోట్ల భూమి చేతులు మారిందని, అందులో అధికార పార్టీవారే ఉన్నారని అంధజ్యోతి కలగన్నది.
‘అమ్మకానికి సొసైటీ భూములు’ అవాస్తవం
అంధజ్యోతి ప్రచురించిన ‘అమ్మకానికి సొసైటీ భూములు’ వార్తపై జిల్లా కలెక్టర్ స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జైపూర్ మండల తహసీల్దార్ రమేశ్ పరిశీలన చేసి గురువారం రాత్రి కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. సర్వే నెంబర్లు 191లో 9.23 ఎకరాలు, 192లో 5.23 ఎకరాలు కలిపి మొత్తం 15.06 గుంటలు దానం ఇచ్చిన భూమి కాదని, అది పట్టా భూమి అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ న్యూస్ పేపర్లో ప్రచురితమైన కథనం అవాస్తవమని తహసీల్దార్ తన నివేదికలో పేర్కొన్నారు.
ఆ 15.06 ఎకరాలు అమ్మినం
మా ఊరు ఇందారంలో 191, 192 సర్వే నంబర్లలోని 15.06 ఎకరాల భూమిని మా నానమ్మ గోనె ఆండాళమ్మ, శ్యాంసుందర్ అగర్వాల్ కుటుంబానికి విక్రయించారు. అది కాకుండా మరో 2.20 ఎకరాలు సొసైటీకి దానంగా ఇచ్చారు. దానం ఇచ్చిన భూమిలో మా గడీ లేదు. ఇప్పటికీ అది మా అమ్మ అరుణాదేవి పేరు మీదే ఉన్నది. అది సొసైటీ భూమి అని రాసిన వార్త అవాస్తవం. శ్యాంసుందర్ అగర్వాల్ కుటుంబం నుంచి ఈ మధ్యే వేరేవాళ్లు ఆ భూమిని కొనుగోలు చేశారు. మొన్న అధికారులు వచ్చి సర్వే చేసినప్పుడు నేను అక్కడే ఉన్నా. మేము దానమిచ్చిన 2.20 ఎకరాలూ వారు అమ్ముకున్నా మాకు అభ్యంతరం లేదు. ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకునే ఆలోచనే లేదు. మా ఊరిలో ఎవరిని అడిగినా ఇది పట్టా భూమి అని చెప్తారు.
– ఆనంద కృష్ణ, గోనె ఆండాళమ్మ మనుమడు
పట్టా భూమినే కొనుగోలు చేశాం
15 ఎకరాల పట్టా భూమిలో రెండెకరాలు నా భార్య మీద కొనుగోలు చేశాం. ఇందులో ఎవరినీ మోసం చేయలేదు. శ్యాంసుందర్ అగర్వాల్ కొడుకు మహేశ్ అగర్వాల్ మాకు విక్రయించారు. ఇంకా ఫ్లాట్లు చేయలేదు. ఈ భూమిపై కన్నేసిన కొందరు కావాలనే ఓ పత్రికను అడ్డం పెట్టుకొని మా మీద అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ 15.06 ఎకరాల్లో కొంత వదిలేసి ఊరిలోకి వెళ్లేందుకు రోడ్డు కూడా వేయించాం. ఈ విషయం ఆండాళమ్మ వారసులు, గ్రామస్థులందరికీ తెలుసు. కావాలని రాద్ధాంతం చేసేందుకే ఇలాంటి తప్పుడు వార్తలు రాశారు.
-ముదాం రమేశ్, రామారావుపేట