Andhrajyothy | పెద్దపల్లి రూరల్, జూలై 28: రాష్ట్రప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయటమే లక్ష్యంగా పెట్టుకొన్న ఆంధ్రజ్యోతి.. తప్పు చేసి కూడా నిస్సిగ్గుగా సమర్థించుకొంటున్నది. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ పాఠశాల వర్షాలకు మునిగిందని తప్పుడు ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయినా ఇంకా బుకాయిస్తున్నది. కాళ్లుకు చుక్క నీరు అంటకుండా స్కూళ్లోకి వెళ్లేందుకు మంచి దారి స్పష్టంగా కనిపిస్తున్నా.. కావాలనే దుష్ప్రచారం చేయటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలోని రాఘవాపూర్ పాఠశాల విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్లేందుకు నిర్మించిన ఎత్తయిన ర్యాంపు ఇది. కుండపోత వర్షాల సమయంలో కూడా కాళ్లకు చుక్క నీరు తగలకుండా ఈ ర్యాంపుపై నుంచే విద్యార్థులు క్లాస్‌రూముల్లోకి వెళ్తున్నారు.
మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి రాఘవాపూర్ స్కూల్ ఆవరణలోకి నీళ్లు చేరాయి. విద్యార్థులు క్లాసు రూముల్లోకి వెళ్లేందుకు ర్యాంపు ఉన్నా టీచర్లతో కలిసి కావాలనే నీటిలో నుంచి విద్యార్థులను వరుస క్రమంలో నడిపించి తీసిన ఫొటోలను 26న ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. మరుసటి రోజు ఎంఈవో విచారణ చేపట్టి, ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తేల్చగా, దానిని నమస్తే తెలంగాణ 27న వాస్తవాలతో సహా ప్రచురించింది. దీంతో ఆంధ్రజ్యోతి తన తప్పును కప్పిపుచ్చుకొనేందుకు మరో కథనాన్ని అల్లింది.
పాఠశాలలోకి ప్రవేశించేందుకు భవనం వెనుకవైపు ఉన్న రోడ్డు నుంచే దారి ఉన్నది అక్కడి నుంచి స్కూళ్లోకి నేరుగా వచ్చి ఈ ర్యాంపుపై నుంచి విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్తారు. ఎంత వర్షం వచ్చినా ఈ మార్గంలో చుక్కనీరు నిలవదు. ఈ మార్గం గ్రౌండ్ కంటే చాలా ఎత్తులో ఉన్నది.
పాఠశాలలో నీరు నిలిచిందని ఉద్దేశపూర్వకంగానే ఆంధ్రజ్యోతి దుష్ప్రచారం చేస్తున్నదని తేలిపోయింది. దీంతో తన వాదనను సమర్థించుకునేందుకు సదరు పత్రిక మరిన్ని తప్పులు చేస్తున్నది. గురువారం ఇక్కడ భారీ వర్షం కురిసింది. అదే సమయంలో కావాలనే నీళ్లలో నిలబడి ఫొటోలు తీస్తున్న ఆంధ్రజ్యోతి రిపోర్టర్.
ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఫొటోలు తీసిన కొద్దిసేపటి తర్వాత పాఠశాల ఆవరణ పరిస్థితి ఇది. వర్షం పడిన గంటలోనే నీరంతా బటయకు వెళ్లిపోయింది. ఆంధ్రజ్యోతి ఉద్దేశపూర్వకంగానే పాఠశాలపై దుష్ప్రచారం చేస్తుందనడానికి ఈ ఫొటోనే సాక్ష్యం.
గురువారం అక్కడ మరోసారి భారీ వర్షం పడటంతో అదే అదనుగా ఆంధ్రజ్యోతి విలేకరి నీటిలో నిలబడి స్కూల్ ఫొటోలు తీశాడు. అదే సమయంలోనే నమస్తే తెలంగాణ ప్రతినిధి కూడా అక్కడి పరిస్థితులను ఫొటో తీశారు. అవే పై ఫొటోలు. విద్యార్థులు రోడ్డుపై నుంచి స్కూళ్లోకి ప్రవేశించి ర్యాంపు పైనుంచి నేరుగా తరగతి గదుల్లోకి వెళ్లొచ్చని స్పష్టంగా కనిపిస్తున్నది. కానీ, ఆంధ్రజ్యోతి గ్రౌండ్లో నీరు నిలిచినప్పుడు ఫొటోలు తీసి దారి లేదని ప్రచారం చేసింది. ఆ ఫొటోలు తీసిన కాసేపటికే నీరంతా బయటకు వెళ్లిపోయింది.
మా ఊరి స్కూల్‌కు పెద్దపల్లి మండలంలోనే మంచి పేరున్నది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాఠశాల ఆవరణలోకి వరద నీరు వచ్చింది. దీంతో నీళ్లలో పిల్లలను ఇక్కడి టీచర్ల సాయంతో నడిపించి ఫొటోలు తీశారు.
– ఆడెపు వెంకటేశం, సర్పంచ్, రాఘవాపూర్.
కొంత మంది స్కూల్‌పై కావాలనే రాజకీయం చేస్తున్నారు. గతంలో స్కూల్లో వసతుల్లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే సౌకర్యాలు కల్పించాం. మైదానంలో 250 లారీల మొరం పోసి సమాంతరంగా తయారు చేసినం.
– తోట శ్రీనివాస్, ఎంపీటీసీ రాఘవాపూర్.
మొన్న కురిసిన వర్షానికి పాఠశాలలోకి నీళ్లు వచ్చినయ్. ఆ నీళ్లు లేకుండా మట్టి (మొరం) పోయించాలన్న ఉద్దేశంతో టీచర్లే పిల్లలను నీళ్లలో నిలబెట్టి ఫొటోలు తీయించారు.
– కోనేటి జ్యోతి, పాఠశాల విద్యాకమిటీ చైర్మన్, రాఘవాపూర్.