Andhrajyothy | పెద్దపల్లి రూరల్, జూలై 26: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాంగులు, వంకలు ఏకమయ్యాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లాలోని రాఘవాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నీరు నిలిచింది. ఇది సర్వసాధారణమే అయినా ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న ‘ఆంధ్రజ్యోతి’ దానిని చిలువలు పలువలుగా చేసి మొదటి పేజీలో పెద్ద బొమ్మను అచ్చేసి ఏదో ఘోరం జరిగిపోయినట్టు రాసేసింది. మూడడుగల లోతు నీటిలో పిల్లలు నడుచుకుంటూ వెళ్లారంటూ రాసుకొచ్చి ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేసింది.
ఈ క్రమంలో వాస్తవాలను విస్మరించి అలవాటైన అబద్ధాలతో వార్తను నింపేసింది. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి కూడా క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో తెలుసుకోకుండానే వార్తను వండి వార్చేసింది. వానాకాలంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు అవస్థలు పడకుండా ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి 2017లోనే గేటు నుంచి స్కూలు వరకు ప్రత్యేక ప్లాట్ఫాం నిర్మించింది. రూ. 40 లక్షల వ్యయంతో పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మించిన సమయంలోనే వెడల్పాటి సిమెంటు ర్యాంపు నిర్మించి విద్యార్థుల వెతలు తీర్చింది. రెండ్రోజులుగా కురుస్తున్న వానలకు ఆవరణలో నీరు చేరినా విద్యార్థులు కాళ్లు తడవకుండా గేటు నుంచి నేరుగా తరగతి గదులకు చేరే అవకాశం ఉంది.
Rain7
ప్రభుత్వం నిర్మించిన ర్యాంపుపై నుంచి వీల్చైర్లు, స్ట్రెచర్లను కూడా సునాయాసంగా తీసుకెళ్లవచ్చు. అయినప్పటికీ సెన్సేషన్ కోసమో, మరి దేనికోసమో, ఇంకోదో లబ్ధికోసమో ఓ రాజకీయ పార్టీతో సంబంధం ఉన్న టీచర్ వారిని నీళ్లలో నడిపించారు. టీచర్ చెప్పడం వల్లే తాము నీటిలోంచి నడుచుకుంటూ వచ్చామని బుధవారం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన పెద్దపల్లి ఎంఈవో సురేందర్కుమార్తో విద్యార్థులు స్వయంగా చెప్పారు. ఇవేవీ పట్టని ‘అంధ’జ్యోతి ఇష్టం వచ్చినట్టు వండివార్చేసి నవ్వులపాలైంది. వార్త రాసేముందు నిజానిజాలు నిర్ధారించుకోవాలన్న కనీస ఇంగితాన్ని గాలికొదిలేసి వార్తను అచ్చేసింది.
ప్లాట్ఫాం ఉండగా, నీటిలో నడుచుకుంటూ ఎందుకు వచ్చారని ఎంఈవో విద్యార్థులను అడిగితే వారు చెప్పింది విని ఆయన షాకయ్యారు. ‘నీటిలోంచి లైనుగా రండి’ అని టీచర్ చెప్పాడంటూ ఆరేడు తరగతుల విద్యార్థులు చెప్పడంతో ఆయన కంగుతిన్నారు. అసలు విషయం ఇదికాగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వేలేకపోతున్న ప్రతిపక్షాలకు తోడైన ఆంధ్రజ్యోతి అవకాశం చిక్కిన ప్రతిసారీ తెలంగాణపై తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఇప్పుడు నిస్సిగ్గుగా అడ్డగోలు ఫొటో ఒకటి వేసి తమకు సిగ్గన్నదే లేదని మరోమారు స్పష్టం చేసింది.