Andhrajyothy | ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): దేవాదుల… తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో పొలాలకు నీళ్లు కాదు… కేవలం ఈ ప్రాంత ఖాతాలో ఒక ప్రాజెక్టును చేర్చాలనే దురుద్దేశంతో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు మేస్త్రీని హెలికాప్టర్లో తీసుకుని వెళ్లి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు. ఆదిలో రూ.3-4 వేల కోట్ల అంచనా విలువతో రూపొందించిన అప్పటి ప్రభుత్వం, ప్లానింగ్ కమిషన్ ముందుకు వెళ్లే సరికి ఏకంగా రూ.9 వేల కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ను సమర్పించింది. అందులో బెనిఫిట్-కాస్ట్ రేషియో (లాభ-వ్యయ నిష్పత్తి) రూపాయికి ఆఠానా కూడా లేదని ప్లానింగ్ కమిషన్ తిప్పి పంపింది. కానీ కరువు పీడిత ప్రాంత రైతులకు సాగునీరు అందించడంలో ఇవేవీ చూడొద్దంటూ అప్పటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. డీపీఆర్‌లో ప్రత్యేకంగా ‘డిస్ట్రెస్డ్ పీపుల్’ పదాన్ని చేర్చి… చివరకు 1:1 నిష్పత్తితో మానవతా దృక్పథంతో అనుమతి ఇవ్వాలని కోరడంతో సానుకూలత వచ్చింది.
ఆచరణలో దేవాదుల ప్రాజెక్టు దుస్థితి ఏందో ఇన్నేండ్లుగా తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీడిజైనింగ్‌లో భాగంగా దేవాదులకు సమ్మక్క బరాజ్‌తో జీవం పోసిందేగానీ లేకపోతే నేటికీ అది తెల్ల ఏనుగే. మరి.. కాళేశ్వరం ప్రాజెక్టు? రికార్డు స్థాయిలో మూడు సంవత్సరాల్లోనే తెలంగాణ రైతాంగానికి ఫలాలను అందిస్తున్న ఆధునిక దేవాలయం ఇది. కానీ..నాడు దేవాదులను ఆహో.. ఓహో.. అని అక్షరాలతో కొనియాడిన చేతులు ఇప్పుడు కాళేశ్వరంపై కాలకూట విషాన్ని చిమ్ముతున్నాయి. కేవలం దేవాదులనే కాదు..నిన్నటిదాకా ప్రాజెక్టుల్లో కరెంటు ఎంత కాలింది? సర్కారు గల్లా పెట్టెకు ఎంత వచ్చింది? అన్న లెక్కలు మరిచిన బుర్రలే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ముందు కూర్చుని చిట్టా పద్దులు రాస్తున్నాయి. ఉరి కొయ్యలకు వేలాడిన తెలంగాణ రైతు, నేడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణను సాకారం చేస్తుంటే వారికి నిద్ర పట్టడం లేదు. తెలంగాణ పొలాలు ఎండితే ‘నెర్రెలు విచ్చిన నేలలు’ అంటూ అక్షరానందం పొందిన రోజులను గుర్తు చేసుకొంటూ.. నేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా జలధారలు పారుతుంటే ఆ అక్కసును గరళంలో దాచుకొని అక్షరాల హాలాహలాన్ని చిమ్ముతున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కొన్నిరోజులుగా ‘ఆంధ్రజ్యోతి’ పరుస్తున్న అడ్డగోలు కథనాల వెనక ఆంతర్యమిదే. తెలంగాణ రైతు బాగుపడ్డది నిజమేనంటూ నోటితో నవ్వుతూ… అందుకు కాళేశ్వరం మాత్రం కారణం కాదంటూ నొసటితో వెక్కిరిస్తున్నది. కాకి లెక్కలతో కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసేందుకు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నది. ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతి కథనాల్లోని అర్ధరహిత, అవగాహనారాహిత్య, అడ్డగోలు రాతలు.. అసలు వాస్తవాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
వరద పోటెత్తినపుడు గోదావరి నీటిని ఎత్తి పోయడానికి బదులు పైకి ఎత్తిపోయాల్సిన సమయంలో గోదావరి నీళ్లన్నీ కిందికి పంపుతున్నారు. బిజీబిజీగా ఉండాల్సిన సమయంలో బాహుబలి మోటర్లు గుర్రు పెట్టి మరీ బజ్జుంటున్నాయి. వరదల సమయంలో కింది నుంచి పైకి రావాల్సిన నీరు పైనుంచి కిందికి జారిపోతుంది. వరద పోటెత్తినపుడు నీటిని ఎత్తిపోయని ఈ ప్రాజెక్టును దాదాపు రూ.లక్ష కోట్ల వెచ్చించి ఎందుకు నిర్మించారో అర్థం కాని పరిస్థితి.. ఇదీ ఆంధ్రజ్యోతి కథనంలో అశాస్త్రీయ వాదన.
కాళేశ్వరం కట్టక ముందు, కట్టిన తర్వాత కూడా 4,000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి. ఈ ఐదేండ్లలో ప్రభుత్వం కాళేశ్వరం పథకం ద్వారా వెయ్యి టీఎంసీల వరకు ఎత్తిపోసి ఉండాలి. వాటిని రిజర్వాయర్లలో నింపి ఉండాలి. తద్వారా కోటి ఎకరాలు సస్యశ్యామలమై ఉండాలి. ఇది ఆంధ్రజ్యోతి వాదన.
రాష్ట్రంలో పంటల ద్వారా ఆర్థికాభివృద్ధి పెరిగినా.. అందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కారణం కాదు. పదిసార్లు గుర్రంగుర్రం అనడం ద్వారా గాడిదను గుర్రం చేయాలనే ఎత్తుగడలో ఇది భాగమే. గత ఐదారేండ్లుగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో పంటలు పండాయి తప్ప కాళేశ్వరంతో కాదు. దీనికి తోడు మిషన్ కాకతీయ కారణంగా రాష్ట్రంలో పంటలు పండాయి. జీఎస్డీపీ పెరిగింది. ఇందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కారణం కాదు. ఇదీ ఆంధ్రజ్యోతి సూత్రీకరణ.
కాళేశ్వరం ప్రాజెక్టు 2018లో అందుబాటులోకి వస్తే, ఇప్పటివరకు కేవలం 168 టీఎంసీలు ఎత్తిపోశారు. ఇందులో 118 టీఎంసీలు తిరిగి గోదావరిలోకి వదిలేశారు. మిగిలిన 50 టీఎంసీల్లో సగం రిజర్వాయర్లలో ఉంటే సగం సాగుకు వినియోగించారు. టీఎంసీకి పది వేల ఎకరాల మేర వరి సాగును లెక్కిస్తే.. 2.50 లక్షల ఎకరాల్లో సాగు ద్వారా వచ్చిన ఆదాయం రూ.500 కోట్లు. కానీ వాస్తవంలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించలేదు. ఇది ఆంధ్రజ్యోతి వాదన.
కాళేశ్వరం ప్రాజెక్టు కింద సృష్టించిన కొత్త ఆయకట్టు 1.25 లక్షల ఎకరాలేనని తేలింది. 2020-21లో రబీ ప్రణాళిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు కింద చూపించిన 35,838 ఎకరాలకు ప్రాజెక్టు కింద నీళ్లిచ్చారు. గత యాసంగి సీజన్లో కాళేశ్వరం ప్రాజెక్టు కింద 74,200 ఎకరాలకే సాగునీరు అందించారు. అందులో 19,700 ఎకరాలు ఆరు తడి పంటలు కాగా, 54,500 ఎకరాల్లో వరి. దీనిని పరిగణనలోనికి తీసుకొంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒనగూరిన ప్రయోజనం నామమాత్రమే. ఇది ఆంధ్రజ్యోతి మాట.
‘తెలంగాణలో వ్యవసాయం తెల్లబడి ఇప్పుడిప్పుడే బాగుపడింది. రైతు దగ్గర పంట బాగా పండి, షావుకార్ల గల్లా కకళకళలాడుతుంది. ఒక డ్రెస్ కొనుక్కునేవారు రెండు డ్రెస్‌లు కొంటుండు. అన్ని రకాల డబ్బు మార్కెట్లోకి వస్తుంది. డబ్బు రైతు దగ్గర ఉండదు. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి జరుగుతున్నది. వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి అంతా రిటర్న్ వచ్చింది’ అని సీఎం కేసీఆర్ అంటున్నారు.. ఇక్కడ కేసీఆర్ వ్యాఖ్య పాక్షికంగానే సత్యం. నాలుగైదేండ్లుగా వర్షాలు బాగా పడ్డాయి. కొంత మిషన్ కాకతీయ కారణంగా రాష్ట్రంలో పంటలు పండాయి. జీఎస్డీపీ పెరిగింది. ఇందుకు కాళేశ్వరం కారణం కాదు.
కాళేశ్వరం పథకంలో ఈ ఏడాది ఏడు టీఎంసీలు ఎత్తి పోశారు. మేడిగడ్డ నుంచి కొండపోచమ్మసాగర్‌కు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయాలంటే రూ.50 కోట్ల విద్యుత్తు బిల్లు అవుతుంది. మిడ్ మానేరుకు రూ.25 కోట్లు, ఎల్లంపల్లికి రూ.12 కోట్లు, మల్లన్నసాగర్‌కు రూ.40 కోట్లు, శ్రీపాద ఎల్లంపల్లికి రూ.12 కోట్లు అవుతుంది. ఎస్సారెస్పీకి పునరుజ్జీవన పథకం కింద 2.5 టీఎంసీలు తరలించగా.. ఒక టీఎంసీకి రూ.30 కోట్ల చొప్పున ఆ నీళ్ల వ్యయం రూ.75 కోట్లు కరెంటు బిల్లులకే కట్టాల్సి ఉంటుంది.
కాళేశ్వరం నుంచి ఏటా పారిశ్రామిక అవసరాలకు నీరందించడం ద్వారా రూ.4,530.56 కోట్లు, ప్రాజెక్టు వెంట తాగునీటి అవసరాలకు అందించడం ద్వారా రూ.56.63 కోట్లు, హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి అవసరాల ద్వారా రూ.424.74 కోట్లు కలిపి ఏటా రూ.5,011.83 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఐదేండ్లలో పట్టుమని రూ.250 కోట్ల ఆదాయం కూడా రాలేదు. అందుకే ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాలను కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్నది.
‘రూ.80వేల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే దాని బాకీ ఎప్పుడో తీరిపోయింది..’ తాజాగా సీఎం కేసీఆర్ అన్న మాటలివి. ఈ మాట విన్న వెంటనే చాలామంది నిపుణులు నోరెళ్లబెట్టారు. బాకీ తీరిపోయిందంటే ఎలా తీరిపోయింది? ప్రాజెక్టు కట్టడానికి ప్రభుత్వం తాను తీసుకున్న అప్పు మొత్తాన్ని తిరిగి కట్టేసిందా? ప్రాజెక్టు ద్వారా సరఫరా చేసిన నీటితో పండిన పంటలతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి జోరందుకుందా? అన్న రకరకాల మిలియన్ డాలర్ల ప్రశ్నలు వారి మెదళ్లను తొలిచేశాయి.
తెలంగాణ సాగునీరు, వ్యవసాయ రంగ ముఖచిత్రాలను మార్చింది కాళేశ్వరం ప్రాజెక్టు అనేది నిర్వివాదాంశం. కాకపోతే రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ, దానికి తందానా అనే రీతిలో ఆంధ్రజ్యోతి ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో ఒక రకమైన దుష్ప్రచారం చేయాలనుకుంటున్నాయి. ఎలాంటి ముందుచూపు లేకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల పథకంలో తెలంగాణ ఏర్పడేనాటికి అంటే ఆరేండ్ల వరకు ప్రధాన బరాజ్ నిర్మాణానికి తట్టెడు మట్టి పని చేయలేదు. ఆరేండ్లలో కేవలం కాల్వలు, సొరంగాల కోసం రూ.7500 కోట్లు ఖర్చు చేసింది. ఇదంతా బూడిదలో పోసిన పన్నీరు అని స్వయంగా అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ సీఎం పృథ్విరాజ్ చౌహాన్ 2013, అక్టోబర్ 15న అప్పటి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి రాసిన లేఖలో కుండబద్దలు కొట్టారు. ఒకవేళ ఆ ప్రాజెక్టును పరిగణనలోనికి తీసుకున్నా.. తమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత జలాలను ఎల్లంపల్లికి తరలిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబుకు దత్త పుత్రులైన రేవంత్‌రెడ్డి, ఆంధ్రజ్యోతి చేస్తున్న దుష్ప్రచారం ప్రకారం… తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసిన నీళ్లు కూడా వరదొస్తే దిగువకు పోవాల్సిందే కదా? కానీ సాంకేతికంగా అలా ఉండదు. ఎత్తిపోసిన నీటిని వెంటనే రాజరాజేశ్వర జలాశయం (మిడ్‌మానేరు)కు తరలించి.. అక్కడి నుంచి చెరువులు నింపడం, ఇతర రిజర్వాయర్లలో నిల్వ చేసి, సాగుకు వినియోగించడం జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడం ద్వారా ఏడాది పొడవునా మూడు బరాజ్‌లలో 35-40 టీఎంసీలు నిల్వ ఉండి, మండు వేసవిలోనూ సజీవ గోదావరి ఆవిష్రృతం కావటం ప్రాణహిత-చేవెళ్లతో సాధ్యమయ్యేది కాదు.
-(గుండాల కృష్ణ, మ్యాకం రవి కుమార్)