హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని రైతులకు వచ్చే వానకాలంలో అంది ంచే వ్యవసాయ రుణాల పరిమితిని రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ అధికారికంగా ఖరారు చేసింది. సాగుచేసే పంట రకాన్ని బట్టి ఎకరాకు గరిష్ఠంగా రూ.1.50 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. వ్యవసాయ ఖర్చులు, ఎరువులు, విత్తనాల ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ఈ రుణ పరిమితులను నిర్ణయించినట్టు వెల్లడించింది. సాధారణ వరి సాగుకు రూ.49 వేలు, శ్రీవరి సాగుకు రూ.38 వేలు, వరి విత్తనోత్పత్తికి రూ.51 వేల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపింది. వరి తర్వాత అత్యధికంగా సాగు చేసే పత్తికి రూ.52 వేలు, వర్షాధార భూములకు రూ.50 వేలు, పత్తి విత్తనోత్పత్తికి అత్యధికంగా రూ.1.50 వరకు రుణ పరిమితిని నిర్ణయించింది.
వాణిజ్య, ఇతర పంటలకు ఇలా..
వాణిజ్య పంటల్లో సాధారణ మిరప సాగుకు రూ.90 వేలు, మల్చింగ్ పద్ధతిలో చేసే సాగుకు రూ. లక్ష చొప్పున పొదవచ్చు. ఎకరా పసుపు సాగుకు రూ.92 వేలు ఇస్తారు. మొక్కజొన్న రైతులకు సాగు విధానం ఆధారంగా ఎకరాకు రూ.32 వేల నుంచి రూ.38 వేలు, స్వీట్‌కార్న్ సాగుకు రూ.43 వేల వరకు రుణం లభిస్తుంది. కంది పంట సాగుకు ప్రాంతం ఆధారంగా ఎకరాకు రూ.23 వేల నుంచి రూ.27 వేల రుణ పరిమితి నిర్ణయించారు. ఉద్యానవన పంటల్లో టమాట సాగుకు రూ.58 వేలు, ఉల్లి సాగుకు రూ.49 వేలు, పప్పు ధాన్యాల సాగుకు రూ.20-22 వేల వరకు రుణం లభిస్తుంది. పాడి రైతులకు ఒక్కో బర్రె పెంపకానికి రూ.37,500, ఆవుకు రూ.38 వేలు, 20+1 గొర్రెలకు రూ.32 వేలు, 20+1 మేకలకు రూ.35 వేలు, 3+1 పందులకు రూ.67 వేల చొప్పున రుణం అందజేస్తారు.
రుణం పొందడం ఇలా..
ఈ రుణాల కోసం రైతులు తమ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) లేదా వాణిజ్య బ్యాంకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, సాగు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా రుణాలను తిరిగి చెల్లించే రైతులకు వడ్డీ రాయితీ వర్తిస్తుంది. రుణ పరిమితులను జిల్లా స్థాయి సాంకేతిక కమిటీల సిఫార్సుల మేరకు అపెక్స్ బ్యాంక్ ఖరారు చేస్తుంది.
రైతులకు బ్యాటరీ స్ప్రేయర్ల పంపిణీ
తెలంగాణ ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ మండల పరిధిలోని ఆరు గ్రామాల రైతులకు భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ మండలి ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో భాగంగా రైతులకు బ్యాటరీ స్ప్రేయర్లు, ప్లాస్టిక్ క్రేట్లను ఉచితంగా పంపిణీ చేశారు. శుక్రవారం ఉద్యాన వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో హార్టికల్చర్ డీన్ చీనానాయక్ మాట్లాడుతూ.. తకువ పురుగుమందుతో ఎకువ పంట విస్తీర్ణంలో పిచికారీకి బ్యాటరీ స్ప్రేయర్లు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ పిడిగం సైదయ్య, శాస్త్రవేత్త బీఎస్కే నిఖిల్, గజేందర్, పాలమూరు రైతు డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు నవాజ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు నరేందర్‌రెడ్డి, పోమాల గ్రామ సర్పంచ్ కవితానరేశ్, భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాములు తదితరులు పాల్గొన్నారు.