హైదరాబాద్/రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలకభూమిక పోషించింది చరఖా. భారత జాతీయ పతాకంలో అశోకచక్రం కన్నా ముందుగా చరఖానే పొందుపరిచారంటే చేనేత ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. నాడు విదేశీ వస్తు బహిష్కరణలోనూ కీలక ఆయుధంగా చేనేత నిలిచింది. దేశీయ చేనేత రంగాన్ని దెబ్బకొట్టేందుకు నాటి బ్రిటిష్ పాలకులు అనేక పన్నులు విధించారు. వాటికి వ్యతిరేకంగా చేనేత కళాకారులు వస్త్రమే ఆయుధంగా ఉద్యమించారు. చేనేత కార్మికులు, మేధావుల సుదీర్ఘ పోరాటాల నేపథ్యంలో 2015లో భారత ప్రభుత్వం ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. ఏటా జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నా, ఆచరణలో మాత్రం ఆ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలు అవలంబిస్తున్నది.
ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్లో చేనేతకు కేవలం రూ.100 కోట్లు కేటాయించేవారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత బడ్జెట్లో రూ.1,200 కోట్లు కేటాయించి చేనేత, మరమగ్గాల పరిశ్రమ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. చేనేత రంగం అభ్యున్నతికి, కార్మికుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేశారు. రైతుబీమా తరహాలోనే చేనేత కార్మికులకు రూ.5 లక్షల బీమా కల్పించారు. చేనేత బీమాకు సంబంధించి ఒక్కో చేనేత కార్మికుడికి జీఎస్టీ రూ.828తో కలిపి మొత్తంగా రూ.5,426 ప్రీమియం ప్రభుత్వమే చెల్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అటకెక్కించింది. కేసీఆర్ సర్కార్ త్రిఫ్ట్ పేరుతో ప్రారంభించిన చేనేత పొదుపు పథకాన్ని సైతం కాంగ్రెస్ సర్కార్ నిలిపివేసింది. అంతేకాదు, రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత చేనేత సంఘాలకు పావలా వడ్డీకి రుణాలను విడుదల చేయలేదు. చేనేత సహకార సంఘాలకు ఇవ్వాల్సిన మారెటింగ్ ఇన్సెంటివ్ (20% రిబేట్)ను నిలిపివేసింది. కేసీఆర్ హయాంలో బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫామ్స్‌కు సంబంధించిన వర్క్ ఆర్డర్లను చేనేత కార్మికులకు అప్పగించి వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచారు. కానీ, కాంగ్రెస్ సర్కార్ ఆ విధానానికి స్వస్తి పలికింది. దీనిపై చేనేత కార్మికులు హైకోర్టుకు వెళ్లగా, నామమాత్రంగా 25% మాత్రమే వస్ర్తాన్ని కొనుగోలు చేసేందుకు సమ్మతించింది.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ సైతం చేనేత రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధానాలే అమలుచేస్తున్నది. చేనేత కళాకారులకు, కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానంగా పని చేయడానికి ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డు ఉండగా, దానిని రద్దు చేసింది. ఆ తరువాత ఆలిండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డ్, ఆలిండియా పవర్లూమ్ బోర్డు, ‘థ్రిఫ్ట్ ఫండ్ కం సేవింగ్స్, సెక్యూరిటీ’ పథకం, కార్మికుల కోసం ఉద్దేశించిన లాంబార్డ్ సాధారణ బీమా పథకం, మహాత్మాగాంధీ భునకర్ బీమా యోజన (ఎంజీబీబీవై), హౌస్ కం వర్క్‌షెడ్ పథకాలను రద్దుచేసింది. ప్రతి స్పిన్నింగ్ మిల్లు చేనేత కళాకారుల కోసం 40% చిలుపల నూలు ఉత్పత్తి చేయాలనే నిబంధన ఉండగా, దానిని 15 శాతానికి కుదించి మరో దెబ్బ కొట్టింది. అన్నింటికీ మించి చేనేత వస్ర్తాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి 5% పన్ను వసూలు చేస్తున్నది.
కేసీఆర్ హయాంలో సిరిసిల్లలోని పురాతన మరమగ్గాలను 100% సబ్సిడీతో రూ.30 కోట్లు కేటాయించి ఆధునీకరించారు. 50% సబ్సిడీతో మరమగ్గాల పరిశ్రమకు నిరంతరాయంగా విద్యుత్తు అందించారు. సిరిసిల్ల నేత కార్మికులకు నిరంతరం ఉపాధి కోసం ప్రభుత్వ ఆర్డర్లు, బతుకమ్మ చీరలు ఆర్వీఎం స్కూల్ యూనిఫారాలు, కేసీఆర్ కిట్, రంజాన్, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్‌లు, సంక్షేమ శాఖకు సంబంధించి వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు, సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకే ఇచ్చి అండగా నిలిచారు. దీంతో నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి లభించడంతోపాటు నెలకు రూ.20 వేల వరకు వేతనాలు పొందారు. చేనేత వస్త్ర పరిశ్రమ టర్నోవర్ సంవత్సరానికి రూ.250 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు పెరిగింది. వలస వెళ్లిన వారు తిరిగి సిరిసిల్లకు రావడం చారిత్రక ఘట్టంగా నిలిచింది. ఇతర రాష్ర్టాల కార్మికులు సైతం ఉపాధి కోసం సిరిసిల్లకు రావడం మరో విశేషం.
కార్మికులను యజమానులుగా మార్చే విధంగా రూ.388 కోట్లతో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ శివారులో అపెరల్ పార్కు ఏర్పాటు చేశారు. ఇందులో 88 ఎకరాల్లో ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని ప్రవేశపెట్టి వీవీంగ్ పార్కును ఏర్పాటు చేశారు. 10 వేల మంది కార్మికులను యజమానులుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు 2023లో తొలి విడతగా 1,104 మంది నేత కార్మికులకు ఒక్కొక్కరికి నాలుగు ఆధునిక మరమగ్గాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ, అంతలోనే ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ వచ్చి పథకాన్ని నిర్లక్ష్యం చేస్తూ మార్గదర్శకాలు నిలిపివేసింది. అంతేకాదు, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కేసీఆర్ సర్కార్ హయాంలో ఇచ్చిన బతుకమ్మ చీరలు, ప్రభుత్వ ఆర్డర్లను నిలిపివేసింది. కనీసం పాత బకాయిలను కూడా సక్రమంగా చెల్లించకుండా చేనేతన్నలను ఇబ్బందులు పెడుతున్నది. 2023లో కేసీఆర్ సర్కార్ ఇచ్చిన బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్ తదితర ఆర్డర్లకు రూ.300 కోట్ల బకాయిలు చెల్లించామని కాంగ్రెస్ సర్కార్ గొప్పలు చెప్తున్నటికీ, ఇప్పటివరకు అందులో 70 శాతమే చెల్లించిందని చేనేత కార్మికులు చెప్తున్నారు.
ఇతర ప్రభుత్వ ఆర్డర్ల బకాయిలు చెల్లించలేదు. వస్ర్తాలను సేకరించిన బిల్లులు కూడా అందివ్వలేదు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రూ.60 కోట్ల విలువైన రంజాన్ తోఫాను టెండర్ల ద్వారా ప్రైవేట్‌కు అప్పగించింది. స్కూల్ యూనిఫారం ఆర్డర్లను ఇచ్చినట్టే ఇచ్చి నెల తర్వాత రద్దు చేసింది. వస్ర్తాల సేకరణను టెండర్ల ద్వారానే తీసుకోవాలనే జీవో-1కు విరుద్ధంగా టెండర్లకు పోయింది. ఈ విషయంపై చేనేత సహకార సంఘాలు హైకోర్టును ఆశ్రయించగా, కాంగ్రెస్‌కు చెంపపెట్టు లాంటి తీర్పును ఇచ్చింది. ఇందిరా మహిళా శక్తి చీరల మొదటి విడత బకాయిలు సైతం చెల్లించకపోవడంతో ఇటు పెట్టుబడికి తెచ్చిన డబ్బుల వడ్డీలు పెరుగడం, ఇందిరమ్మ చీరల తయారీకి పెట్టుబడి లేకపోవడం, నూలు అందుబాటులో లేకపోవడంతో యజమానులు, ఆసాములు లబోదిబోమంటున్నారు. ఇటీవల మొక్కుబడిగా రెండో విడత ఇందిరా మహిళా శక్తి చీరల 3.06 కోట్ల మీటర్లు వస్త్ర ఆర్డర్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చేనేత కార్మికుల జీవితాల్లో మరోసారి చీకట్లు నింపుతున్నాయి. ఇప్పటికే 16 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నది.

అటు కేంద్రంలోని బీజేపీ సర్కార్.. ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్.. రెండూ కలిసి చేనేత కార్మికుల పొట్టగొడుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, ఉన్న పథకాలనే రద్దు చేస్తున్నాయి. చేనేత రంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయి. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కార్ వచ్చిన తరువాత కొత్త పథకాల సంగతేమోకానీ గతంలో కేసీఆర్ అమలు చేసిన పథకాలను సైతం రద్దు చేస్తున్నారని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత రంగంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురసరించుకుని శుక్రవారం ఉదయం 8గంటలకు చార్మినార్ నుంచి మహల్లా ప్యాలెస్ వరకు హ్యాండ్లూమ్ వాక్ నిర్వహిస్తామని చేనేత దినోత్సవ వ్యవస్థాపకుడు యర్రమాద వెంకన్న తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేనేత, జౌళి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి జయేశ్‌రంజన్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, సినీ నటి పూనమ్కౌర్తోపాటు వివిధ రంగాల విశిష్ట నాయకులు, చేనేత కళాకారులు, చేనేత ప్రేమికులు పాల్గొంటారని వివరించారు.
నాకు 18 ఏండ్ల వయస్సు వచ్చినప్పటి నుంచి మరమగ్గాలు నడుపుతున్నాను. నేను, నా భార్య సాంచాలు కిరాయికి తీసుకొని నడుపుకుంటున్నం. కేటీఆర్ మాకు బతుకమ్మ చీరలు, ఇతర ఆర్డర్లు ఇచ్చి ఆదుకున్నడు. బతుకమ్మ చీరలతో మా బతుకులు మారినయ్. అప్పులు తీరినయ్. అంతేకాకుండా వర్కర్ టు ఓనర్ పథకం కోసం మమ్మల్ని ఎంపిక చేసిండ్రు. హైదరాబాద్‌లోని దశాబ్ది ఉత్సవాల్లో నా భార్య సంధ్యకు ఉత్తమ మహిళా నేత కార్మికురాలిగా అవార్డు, రూ.10 వేల నగదు ఇచ్చి సత్కరించారు. సర్కార్ మారడంతో మా బతుకులు మళ్లీ మొదటికి వచ్చాయి. కాంగ్రెస్ సర్కార్ మమ్మల్ని పట్టించుకుంటలేదు. వర్కర్ టు ఓనర్ కోసం కేసీఆర్ సర్కార్ కట్టించిన వర్క్ షెడ్లను వృథాగా ఉంచారు. వర్క్ టు ఓనర్ పథకంలో మరమగ్గాలు ఇవ్వకుండా నిలిపివేశారు. యజమానులు అవడం కలగానే మిగిలింది. – వనం మహేశ్, సంధ్య, నేతకార్మిక దంపతులు, రాజీవ్‌నగర్, సిరిసిల్ల