Srinivas Goud | హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ను సుల్తాన్ బజార్‌లోని చాట్ భండార్‌లాగా మార్చారని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. త్వరలోనే నీరా కేఫ్‌ను ఎత్తేస్తున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇవాళ ఆ కేఫ్‌ను శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. నీరా కేఫ్ రూపురేఖలు మార్చారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో కేఫ్ ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అంతరించిపోతున్న కులవృత్తులను పునరుద్ధరణ చేసి.. కులవృత్తులను బాగుచేయాలని నాడు కేసీఆర్ ఆలోచన చేశారు. ఈ నేపథ్యంలో అంతరించిపోతున్న నీరాను అందుబాటులోకి తెచ్చి గౌడన్నలకు ఆసరాగా నిలవాలనుకున్నాం. కల్లు, నీరాలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. నా జాతిలో ఉన్న అమృతం లాంటి నీరాను ప్రపంచానికి మరోసారి పరిచయం చేశాం. బీసీ కార్పొరేషన్ ద్వారా రూ. 20 కోట్లతో దేశంలో ఎక్కడా లేనివిధంగా నీరా పాలసీ తీసుకొచ్చాం. ఆ పాలసీలో నీరాను గౌడ కులస్తులే అమ్మాలని నిర్ణయించామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఈ క్రమంలోనే నెక్లెస్ రోడ్డులో ఆధునికీకరించిన బిల్డింగ్‌లో నీరా కేఫ్‌ను ఏర్పాటు చేశాం. ఇవాళ ఈ నీరా కేంద్రాన్ని ప్రైవేట్ పరం చేసి శంకర్ రెడ్డి అనే వ్యక్తికి ఇచ్చారని తెలిసింది. దీన్ని సుల్తాన్ బజార్లో ఉండే చాట్ భండార్ లాగా మార్చారు. మేము ఏర్పాటు చేసిన ఏసీ, అద్దాలు అన్నీ తీసేసి నీరా కేంద్రం రూపురేఖలు మార్చారు. ఈ కేఫ్‌ను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి గౌడన్నల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. గౌడన్నల గుండెలపై తన్నారు. నీరా పాలసీ ఎత్తేస్తూ, నీరా కేంద్రాన్ని ఎత్తేస్తూ ప్రైవేట్ పరం చేయడం బాధాకరం అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్ ఏర్పాటు చేసిన భూమి ప్రభుత్వానిది. నిర్వహణ టూరిజం శాఖకు అప్పగించాం. వెంటనే ఈ కేంద్రం ప్రైవేట్ కాంటాక్ట్‌ను వాపస్ తీసుకోకపోతే మా ఆగ్రహానికి గురిగాక తప్పదు. ఇలాంటి ధోరణిని అన్ని కులాలవారు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. కొన్ని కులాలను అణిచివేసి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మంచిది కాదు. వారం రోజుల్లో వాపస్ తీసుకోకపోతే కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే అసెంబ్లీ, సెక్రటేరియట్ సహా హైదరాబాద్‌ను ముట్టడిస్తాం అని మాజీ మంత్రి హెచ్చరించారు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడతామన్నారు పెట్టలేదు అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Gandhi Bhavan | గాంధీ భవన్ మెట్లు ఎక్కితేనే బోనస్ డబ్బులు జమ
SLBC | శ్రీశైలం సొరంగ మార్గం ఆలోచన వెనుక అసలు కథ ఇదీ..
SLBC Tunnel | అసలు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ఎందుకు తవ్వుతున్నారు.. దాంతో ఏం లాభం?