Gandhi Bhavan | నల్లగొండ : శాలిగౌరారం మండలం అంబారిపేటకు చెందిన రైతు తోట యాదగిరి ఖాతాలో ఎట్టకేలకు సన్న ధాన్యం బోనస్ డబ్బులు జమయ్యాయి. తనకు రైతు రుణమాఫీ కాలేదని, బోనస్ డబ్బులు కూడా పడలేదని శుక్రవారం యాదగిరి ఏకంగా హైదరాబాద్లోని కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ మెట్లపై ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తనను జైల్లో పెట్టినా సరే తనకు రావాల్సిన రుణమాఫీ, బోనస్ డబ్బులు ఇచ్చే వరకు అక్కడి నుంచి వెళ్ళేది లేదని భీష్మించారు.
అయితే యాదగిరి ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. యాదగిరికి రావాల్సిన బోనస్ డబ్బుల గురించి ఇన్నాళ్లు పట్టించుకోని ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగింది. శనివారం ఆగమేఘాల మీద బోనస్ డబ్బులు ఖాతాలో జమ చేసింది. ఇదే విషయాన్ని రైతు తోట యాదగిరి ధ్రువీకరిస్తూ సన్న ధాన్యానికి బోనస్ డబ్బులు పడ్డాయని తెలిపారు.
ఆదివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. రుణమాఫీ ఇంకా కాలేదని ఈ విషయంఫై సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తీరుతానని స్పష్టం చేశాడు. అయితే గాంధీ భవన్కు వస్తే తప్పా.. బోనస్ డబ్బులు ఇవ్వరా అంటూ..? మిగతా రైతులు ప్రశ్నిస్తునారు. ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ. 47 కోట్ల వరకు బోనస్ డబ్బులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం.