Niranjan Reddy | హైదరాబాద్ : తెలంగాన రాష్ట్రం కోసం జరిగిన మలిదశ ఉద్యమానికి కేంద్ర బిందువు తెలంగాణ వ్యవసాయం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. వ్యవసాయానికి కావాల్సిన సాగునీరు, కరెంట్ ఇచ్చి రైతాంగాన్ని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టెక్కించారని తెలిపారు. ఇక 1 లక్షలోపు రుణం ఉన్న రైతులు మా ప్రభుత్వంలో 39 లక్షల మంది రైతులు ఉంటే, ఆ సంఖ్య ఇప్పటికీ పెరిగి 45 లక్షలు అయింది. కానీ ఈ ప్రభుత్వం మొదటి, రెండు విడతల్లో కలిపి కేవలం 16 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేసింది మరి మిగతా రైతుల రుణమాఫీ సంగతి ఏంటి..? అని నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీశారు.
వ్యవసాయం మీద ఆధారపడి బతికే రైతులు గుండె మీద చేయి వేసుకుని నిద్రపోయే పరిస్థితిని నాటి సీఎం కేసీఆర్ తీసుకొచ్చారు. సహజ వనరులైన భూములను, వాటికి అవసరమైన జలాలు, కరెంట్, పెట్టుబడి వంటి సంపూర్ణ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు కేసీఆర్. దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలంగాణ వ్యవసాయాన్ని కీర్తించాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కూడా తెలంగాణ వ్యవసాయం గొప్పగా ఉందని ప్రశసించారు. నేను కలల కన్నట్లు తెలంగాణ వ్యవసాయం ఉందని స్వామినాథన్ అన్నారని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు.
భారతదేశంలోనే తొలిసారి సాహసం చేసి.. వ్యవసాయాన్ని గట్టెక్కిస్తే వారే పది మందికి ఉపాధి కల్పిస్తారనే మదనపడి తన మేధస్సును కరిగించి తెలంగాణ వ్యవసాయాన్ని బాగు చేశారు కేసీఆర్. అందులో భాగంగానే కేసీఆర్ రైతుల రుణాలను మాఫీ చేశారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ప్రవేశపెట్టారు. 39 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ చేశాం. మిగిలిన వారికి ఎన్నికల తర్వాత చేస్తామన్నాం కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రైతాంగానికి ఎన్నికలు, ఓట్ల కోసం హోల్ సేల్ అబద్దాలు చెప్పింది కాంగ్రెస్ పార్టీ. వారి మేనిఫెస్టోలో కూడా 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9నాడు చేసి తీరుతామని చెప్పారు. అవసరమైతే రైతులు రుణాలు అర్జంట్‌గా తెచ్చుకోండని నేటి సీఎం రేవంత్ రెడ్డి నాడు చెప్పారు. ముందేమో రైతు రుణాలు రూ. 40 వేల కోట్లు అని చెప్పి, చివరకు పత్రికా ప్రకటనల్లో రూ. 31 వేల కోట్లు అని ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9న రుణాలు మాఫీ చేస్తామని చెప్పి.. జులై నెలలో కేవలం 6 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారు. రైతుబీమా వచ్చిన తర్వాత సమిష్టిగా ఉండే కుటుంబాల్లో భూములు పంచుకుని వ్యవసాయం చేశారు. తెలంగాణ సర్కార్ దిగిపోయే నాటికి రైతుబంధు ఖాతాలు 69 లక్షల పైచిలుకు ఉంటే రుణాల తీసుకున్న సంఖ్య 60 లక్షల పైచిలుకు ఉంది. మరి ఈ 60 లక్షల పైచిలుకు రుణాలు పొంది ఉన్న రైతుల్లో 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య ఎక్కువ. తొంభై రెండున్న శాతం భూమి 5 ఎకరాల్లోపు ఉన్న రైతుల చేతుల్లో ఉంది. అటువంటప్పుడు లక్ష లోపు రుణం కలిగిన ఉన్న రైతుల సంఖ్య 39 లక్షలు ఉంటే.. ఇప్పుడు అది 40 నుంచి 45 లక్షల మధ్యలో ఉండాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడుతలో 11 లక్షలు, రెండో విడుతలో 5 లక్షల మంది రైతులకు మాత్రమే రుణాలు మాఫీ చేసింది. మరి మిగతా రైతులు ఎటు పోయారు..? రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్యను జిల్లాలవారీగా ఎందుకు ఇవ్వడం లేదు. ఎందుక గోప్యంగా ఉంచుతున్నారు. మొదటి, రెండో విడుత కలిపి మీరు ఇచ్చినటువంటి డబ్బు రూ. 12 వేల కోట్ల చిల్లర మాత్రమే. మీరు చేసిన ఘనకార్యం ఏందన్నట్టు..? అని నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి..
KTR | ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గొడ్డు కారంతో భోజనం.. మండిపడ్డ కేటీఆర్
Nagarjuna Sagar | నాగార్జునసాగర్‌లో జలకళ.. ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
KTR | స్వయంగా ముఖ్యమంత్రే ఆడబిడ్డలను అవమానిస్తుంటే.. తామేమీ తక్కువకాదనేలా పోలీసులు: కేటీఆర్
SC Reservations | రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల అమలు ఎలా?