గట్టుప్పల్, ఫిబ్రవరి 27 : గట్టుప్పల్ తాసీల్దార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారింది. కాసులకు కకుర్తి పడి.. చేతులు తడిపితే చాలు.. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టుగా భూములను సృష్టించి అధికారులే విక్రయిస్తున్నారు. పైరవి కారులకు వంత పాడుతూ, ధనార్జనే ధ్యేయంగా దళారుల అవతారం ఎత్తుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. రెవెన్యూ చట్టంలోని లొసుగులను అవకాశంగా తీసుకొని జేబులు నింపుకుంటున్నారు. అధికార పార్టీ నాయకులకు వంత పాడుతూ… తమకు ఎవరూ అడ్డు లేరనే ధోరణిలో అధికారులు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భూములకు రక్షణ కల్పించాల్సిన తాసీల్దారే అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతూ అక్రమారులకు కొమ్ముకాస్తూ అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేయడంతో అనుమానాలు వస్తున్నాయి.
తేరట్ పల్లిలో సర్వే నం. 444లో 7 ఎకరాల 7 గుంటల భూ మికి గాను అదనంగా మరో ఇద్దరు పట్టాదారులను చేర్చి 7 ఎకరాల 27 గుంటలకు విస్తీర్ణం పెంచారు. ఉండాల్సిన భూమి కన్నా 20 గుంటల భూమి ఎలా వచ్చిందో ఆ దేవునికే ఎరుక.
మండల కేంద్రంలో సర్వే నంబర్ 2లో పాత రికార్డుల ఆధారంగా పహాణీలను సైతం పకనపెట్టి పొంతన లేని కాగితాలతో అధికార పార్టీ అండ దండతో ఓ వ్యక్తికి స్థానిక తాసీల్దార్ రిజిస్ట్రేషన్ చేశారు. నిబంధనలకు పాతరేసి వసూళ్లకు పాల్పడి మరీ ఈ పనిచేస్తున్నట్లు కార్యాలయ సిబ్బంది గుసగుసలాడుతున్నారు. దానికి తోడు పట్టా ఓచోట, కబ్జా ఓచోట ఉన్నా అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అండతో లక్షల్లో విలువచేసే భూమిని కబ్జా చేసినట్లు తెలిసింది. గతంలో ఈ కార్యాలయంలో కొన్ని రోజుల పాటు పనిచేసిన ఓ ప్రైవేట్ వ్యక్తికి కూడా సర్వేనెంబర్ 2లో కొంత భూమి రిజిస్ట్రేషన్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. నూతన పట్టాదారులకు దాదాపుగా 6 గుంటలకు పైచిలుకు ఉన్న వాటిని మాత్రమే రిజిస్ట్రేషన్ చేసే తాసీల్దార్, 6 గుంటలకు తకువ ఉన్న ఆ ప్రైవేట్ వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడంతో పెద్ద మొత్తంలోనే వసూలు చేసినట్లు తెలుస్తున్నది. సర్వేనంబర్ 2లోని అక్రమ పట్టా విషయంలోనే కాకుండా, ప్రొసీడింగ్స్ వంటి మరో కొన్ని పత్రాల తయారీ విషయంలో కూడా పక మండలం నుంచి సంబంధిత పత్రాలు సృష్టించినట్లు తెలుస్తున్నది. ఈ వ్యవహారంలో ఓ ప్రైవేటు వ్యక్తి కీలకపాత్ర పోషించినట్లు తెలిసింది.
తాసీల్దార్ కార్యాలయంలో ఏ పని జరగాలన్న ప్రైవేటు వ్యక్తులకు ఎంతో కొంత ముట్టచెబితే కానీ కాగితాలు కదలని పరిస్థితి నెలకొంది. దరఖాస్తు దారు నుంచి వచ్చే ప్రతి పైసా పై అధికారులకు చేరుతున్నట్లు, ఆ ప్రైవేటు వ్యక్తులు దరఖాస్తుదారులకు చెబుతున్నట్లు సమాచారం. కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా చలామణి అవుతున్న ఓ ప్రైవేట్ వ్యకి,్త స్థానిక డీలర్ సహాయంతో ఇటీవల నూతన రేషన్ కార్డుల జారీలో భాగంగా ఒకో నూతన దరఖాస్తుదారు నుంచి రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు వసూలు చేసి, విచారణకు సంబంధించి, పై నుంచి కింది స్థాయి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరో వింత ఏంటంటే నూతన రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు దారుని వద్దకు సంబంధిత అధికారులు విచారణకు వెళితే, దరఖాస్తు దారుడు.. అప్పటికే తనకు కార్డు మంజూరైందని, ఇంకా విచారణ దేనికంటూ ఆ అధికారిని ప్రశ్నించినట్లు తెలిసింది.
గట్టుప్పల్ తాసీల్దార్‌పై వస్తున్న ఆరోపణలపై పూర్తి విచారణ చేస్తాం. ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలను మాకు పంపమని కోరాం. పూర్తి వివరాలు అందాక జిల్లా అధికారులకు పంపిస్తాం.
-శ్రీదేవి, చండూరు ఆర్డీవో
తాసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాలి. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ విచారణ జరిపించి, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం.
-ఇడం కైలాసం, బీఆర్ఎస్ మండల కన్వీనర్
స్థానిక తాసీల్దార్ అక్రమాలు స్థానికుల కండ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఓ ప్రైవేటు వ్యక్తి పనిచేస్తూ ప్రతి దరఖాస్తుకు డబ్బులు వసూలు చేయడం అలవాటుగా మారింది. నూతన రేషన్ కార్డుల దరఖాస్తులో లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
-కర్నాటి వెంకటేశం,మాజీ జెడ్పీటీసీ
ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ఉన్న పత్రాలతోనే నిజమని నిర్ధారించుకొని పనిచేశా. నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం. ప్రజలకు న్యాయం చేసే విధంగా పనిచేస్తా… తేరట్ పల్లిలో 444 సర్వే నెంబర్ విషయంలో రైతులకు అన్యాయం చేయం. రేషన్ కార్డుల మంజూరు విషయంలో డబ్బులు తీసుకుంటున్న విషయం నా దృష్టికి రాలేదు. వస్తే వారిపై చర్యలు తీసుకుంటాం.
-రాములు, గట్టుప్పల్ తాసీల్దార్