Lavanya Tripathi | మెగా కోడలు, ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి ఇటీవల సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశంగా మారారు. అయితే ఈసారి ఆమె నటించిన సినిమా వల్ల కాదు.. ప్రసవం తర్వాత శరీరంలో వచ్చిన సహజ మార్పుల కారణంగా కొందరు నెటిజన్లు చేసిన బాడీ షేమింగ్ కామెంట్లు వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో లావణ్యకు మద్దతుగా అభిమానులు, పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో బలంగా స్పందిస్తున్నారు. ఇటీవల ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన లావణ్య త్రిపాఠి.. గతంతో పోలిస్తే కొంత బరువు పెరిగినట్లు కనిపించారు. దీంతో సోషల్ మీడియాలో కొందరు ఆమె రూపురేఖలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బాడీ షేమింగ్‌కు పాల్పడ్డారు. “ఆంటీలా కనిపిస్తున్నారు” అంటూ చేసిన కామెంట్లు విమర్శలకు దారితీశాయి.
ఈ ట్రోలింగ్‌పై మెగా అభిమానులతో పాటు పలువురు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భధారణ, ప్రసవం తర్వాత మహిళ శరీరంలో మార్పులు రావడం పూర్తిగా సహజమని, ప్రతి తల్లి కోలుకోవడానికి సమయం అవసరమని గుర్తుచేస్తున్నారు. ఒక మహిళ తల్లిగా మారిన తర్వాత శరీరంలో వచ్చే సహజ మార్పులను గౌరవించాలి. అలాంటి సమయంలో ఆమె రూపాన్ని ఎగతాళి చేయడం సరికాదు అంటూ సోషల్ మీడియాలో లావణ్యకు మద్దతుగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ సంస్కృతికి ముగింపు పలకాలంటూ అనేక మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిత్వాన్ని, ప్రతిభను పక్కనబెట్టి కేవలం శరీరాకృతిని విమర్శించడం సమాజానికి మంచిది కాదని పేర్కొంటున్నారు. ప్రస్తుతం లావణ్య త్రిపాఠికి మద్దతుగా #SupportLavanyaTripathi వంటి పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ని ప్రేమించి వివాహం చేసుకున్న లావణ్య త్రిపాఠి.. గత ఏడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తమ కుమారుడికి ‘వాయువ్ తేజ్’ అని పేరు పెట్టి ప్రస్తుతం కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నారు. మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ కొంతకాలంగా సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె.. త్వరలోనే మళ్లీ కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లావణ్య త్రిపాఠి 2012లో హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘అందాల రాక్షసి’ చిత్రంతో టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమయ్యారు. అనంతరం ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘మిస్టర్’, ‘యుద్ధం శరణం’, ‘అంతరిక్షం 9000 KMPH’ వంటి పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.