నల్లగొండ: ఎగువన భారీ వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. వరద పోటెత్తడంతో ఆలమట్టి నుంచి శ్రీశైలం వరకు కృష్ణా, దాని ఉపనదులపై ఉన్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. దీంతో నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు పెద్దఎత్తున వచ్చిచేరుతున్నది. క్రమంగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో అధికారులు.. సాగర్ గేట్లు తెరిచారు. ఒక్కొక్కటిగా మొత్తం ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఉదయం 11 గంటలకు ఎస్ఈ నాగేశ్వరరావు, సీఈ అనిల్ కుమార్ కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేశారు. తొలుత దిగు ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం మూడుసార్లు సైరన్ మోగించారు. అనంతరం ఒక్కొక్కటిగా ఆరు గేట్లు ఎత్తారు. ప్రస్తుత సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ సంవత్సరం రెండు పంటలకు ఇకా ఢోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం ఉదయం 8 గంటలకు సాగర్‌కు 4,41,183 క్యూసెక్కుల వరద వస్తుండగా, ఔట్‌ఫ్లో 40,516 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులుండగా, ప్రస్తుత నీటి మట్టం 580.40 అడుగులకు చేరుకుంది. డ్యామ్ నీటినిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలకు గానూ ప్రస్తుత నీటి నిల్వ 284.16 టీఎంసీలుగా ఉన్నది.