మణికొండ, మార్చి 11 : తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చిన సీఎం రేవంత్‌రెడ్డి దోపిడీ అంతాఇంతా కాదని, అన్నిరంగాల్లో అక్రమాల విధ్వంసం సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు బుధవారం కోకాపేట నియోపొలిస్‌లో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న భాగ్యలక్ష్మి మినరల్స్ క్రషర్లను కమిటీ బృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ కొత్వాల్‌గూడలో కేజీఎఫ్ తరహాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రా ఘవ కన్స్ట్రక్షన్ కొనసాగుతున్న మైనింగ్ మాఫియాకు మించి కోకాపేటలో సీఎం మేనల్లుడి క్రషర్లు నడుస్తున్నాయని విమర్శించారు. 17 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పనంగా దండుకొని కేవలం సీఎం అనుమతులతో మూడు క్రషర్లను నడుపుతున్నారని ఆరోపించారు. పర్యావరణాన్ని విధ్వంసం చేస్తుంటే అధికారయంత్రాంగం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి తన అనుయాయులకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టి క్రషర్ల ద్వారా నెలకు రూ.2కోట్ల నుంచి రూ.3కోట్లు దండుకుంటున్నాడని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఏ ప్రభుత్వ భూములలైనా టెండర్ విధానంలో అప్పగించాలనే నిబంధనలున్నా, ముఖ్యమంత్రి మాత్రం అత్యాశతో తన మేనల్లుడికి నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మొబైల్ మిక్సింగ్ ప్లాంట్ పేరిట అనుమతులు తీసుకొని నిబంధనలు ఉల్లంఘిస్తుంటే హైడ్రాకు కన్పించడం లేదా మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ అక్రమంగా మైనింగ్, క్రషర్లు, ఇసుక, రియల్ ఎస్టేట్లను కొనసాగిస్తున్నదని ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అభిలాష్‌రెడ్డి, గోసుల శ్రీనివాస్, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ సాయిబాబా, నార్సింగి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వి ష్ణువర్దన్రెడ్డి, నియోజకవర్గ మైనారిటీ విభాగం అధ్యక్షుడు షేక్ ముక్తార్‌పాషా, నాయకులు విష్ణు, గణేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.