తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు దర్పణం పడతాయి బోనాలు. వారం, వారం ఈ ఉత్సాహం రెట్టింపవుతుంది. అమ్మోరు తల్లి జాతరతో జంటనగరాలు పులకించిపోతాయి. ఈ సందడిలో పాలుపంచు కోవడానికి తెలంగాణ జిల్లాల నుంచీ భక్తులు తరలి వస్తుంటారు. ప్రధాన ఆలయాలతోపాటు నగరవ్యాప్తంగా ఉండే గ్రామదేవతల గుళ్లలోనూ బోనాల సందడి మిన్నంటుతుంది. సాధారణంగా, ఆషాఢంలో వానలు జోరందుకుంటాయి. వివిధ రకాల అంటువ్యాధులు ప్రబలుతుంటాయి. ప్రకృతిలో, ప్రజల్లో ప్రతికూల పరిస్థితులు తలెత్తిన వేళ.. అమ్మవారి అనుగ్రహం కోరుకుంటారు భక్తులు. ఆ తల్లి సంహారశక్తితో ఈ ప్రతికూలతలు పలాయనం చిత్తగిస్తాయని భక్తుల విశ్వాసం. గ్రామదేవతగా ఉగ్రరూపాలతో కొలువుదీరిన కాళిక.. పల్లెలను కాపాడే కల్పవల్లి. ఆ అమ్మతత్త్వం అనిర్వచనీయం. అర్థమయ్యే కొద్దీ సదా స్మరణీయం.
మానవ మేధస్సు ఎప్పుడూ సుఖాన్ని, సౌమ్యతను, ప్రశాంతతను మాత్రమే ‘దైవత్వం’గా భావించడానికి ఇష్టపడుతుంది. కానీ, ప్రకృతిలోని పరమసత్యాన్ని నిష్పాక్షికంగా పరిశీలిస్తే ఒక కఠినమైన నిజం బోధ పడుతుంది. ప్రకృతిలో, ఈ సృష్టిలో సౌమ్యత ఎంత నిజమో, సంహార తత్త్వమూ అంతే నిజం. భగవంతుడు మన ఇష్టాయిష్టాలకు, మన భావోద్వేగాలకు అనుగుణంగా జగత్తును నడపడు. సృష్టికి తనదైన నిర్దాక్షిణ్యమైన, అవ్యాజమైన ధర్మం ఉంది. వినడానికి, అనుభవించడానికి ఇది కష్టంగా అనిపించినా… సృష్టిలోని ఈ భయానక, సంహార కోణాన్ని కూడా దైవత్వంగా స్వీకరించడమే అత్యున్నతమైన ఆధ్యాత్మిక పరిణతి. ఈ పరమ సత్యానికి సంస్కృత ఆధ్యాత్మిక శోధనలు ఇచ్చిన మహోన్నత ప్రతిరూపమే ‘కాళీ తత్త్వం’.
ప్రకృతిలో వెలుగు ఎంత నిజమో, చీకటీ అంతే నిజం. జననం ఎంత సత్యమో, మరణం కూడా అంతే సత్యం. కాళికాదేవి ఒక చేతిలో అభయముద్ర, మరొక చేతిలో వరద ముద్ర ధరిస్తుంది. ఇది తల్లిగా తన పిల్లలకు ఇచ్చే ప్రేమ, రక్షణ, వాత్సల్యానికి ప్రతీక. మరొక రెండు చేతులలో ఖడ్గం, నరికిన అసురుని శిరస్సు ధరించి, రుండమాలలతో నృత్యం చేస్తుంది. ఇది సంహారశక్తినీ, ప్రకృతిలో దాగి ఉన్న విధ్వంసక తత్త్వాన్నీ సూచిస్తుంది. ఈ రెండూ వేర్వేరు కావు. ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు. కాళీ స్వరూపం ఆధ్యాత్మిక అంతరార్థం. ఈ రూపం మనకు ఒక పరమసత్యాన్ని బోధిస్తుంది. భయంకరమైన ప్రకృతి వెనుక అంతర్లీనంగా జగజ్జనని ప్రేమ దాగి ఉంది. ‘కాళి’ అనే పదానికి మూలం ‘కాలం’. కాలం ప్రతిదానినీ తన కుక్షికోశంలోకి లాక్కుంటుంది. పుట్టిన ప్రతిదీ, రూపం దాల్చిన ప్రతి వ్యవస్థా కాలంలో కలిసిపోక తప్పదు. కాలం ఎవరికైనా సమానమే! అది రాజునూ, పేదనూ, సాధువునూ, రాక్షసునీ ఒకేరీతిగా తనలో విలీనం చేసుకుంటుంది.
సృష్టి నియమంలో విధ్వంసం లేకుండా పునర్నిర్మాణం లేదు. ప్రకృతిలో సంహారం అనేది ఏదో ఆకస్మికంగా జరిగే ప్రమాదం కాదు. అది సృష్టి క్రమంలో అంతర్లీనంగా ఉన్న ఒక అనివార్య ప్రక్రియ. ఒక విత్తనం తన రూపాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటేనే గాని పెద్ద వృక్షం జన్మించదు. పాత ఆకులు రాలిపోతేనే కొత్తచిగుళ్లు వస్తాయి. నక్షత్రాలు పేలిపోతేనే కొత్త గ్రహాలు, సూర్యుళ్లు పుట్టుకొస్తాయి. మనం ‘సంహారం’ లేదా ‘విధ్వంసం’ అని దేనినైతే భయంతో పిలుస్తామో, అది ప్రకృతి దృష్టిలో నూతన సృష్టికి వేసే పునాది. శక్తేయం ప్రకారం, సృష్టి (సృజనాత్మకత), స్థితి (పరిపాలన), లయం (సంహారం) అనేవి వేర్వేరు శక్తులు కావు. ఒకే ఆదిపరాశక్తి వివిధ ప్రకటనలు.

లయం లేదా సంహారం లేకపోతే సృష్టిచక్రం స్తంభించిపోతుంది. భారతీయ రుషులు, ద్రష్టలు దైవాన్ని కేవలం ప్రశాంతమైన మూర్తిగా ఊహించి ఊరుకోలేదు. సత్యాన్ని ‘ఉన్నది ఉన్నట్లుగా’ దర్శించారు. అందుకే కాళీ స్వరూపంలో సౌమ్య, భయానక రూపాల ఆశ్చర్యకరమైన సమ్మేళనాన్ని ప్రతిష్ఠించారు. కాళీతత్త్వం అంటే అనివార్యమైన కాలప్రవాహాన్ని, మార్పును స్వీకరించడం. ‘జగత్తు నా ఇష్ట ప్రకారం నడవాలి, నాకు నచ్చినట్లే అన్నీ జరగాలి’ అనే మానవ అజ్ఞానాన్ని, అహంకారాన్ని ఈ తత్త్వం పటాపంచలు చేస్తుంది. దైవత్వం అంటే మన కోరికలు తీర్చే యంత్రం కాదు. సృష్టి ధర్మానికి శిరస్సు వంచి ఆత్మశరణాగతి చేయడమే అసలైన ఉపాసన.
చాలామంది భగవంతునిలోని ‘సౌమ్య’ తత్త్వాన్ని మాత్రమే ప్రేమించి, ‘భయానక’ తత్త్వాన్ని చూసి కొంత జంకుతారు. కానీ, పూర్ణజ్ఞానికి ఈ రెండూ ఒకే పరమాత్మ రూపాలని తెలుస్తుంది. రామకృష్ణ పరమహంస కాళీదేవిని ఉపాసిస్తూ ఈ సత్యాన్నే లోకానికి చాటారు. తల్లిపాలు ఇస్తూ ప్రేమించే చేతిని, క్రమశిక్షణ నేర్పే చేతిని బిడ్డ ఎలా సమానంగా స్వీకరిస్తాడో… జ్ఞాని అయినవాడు ప్రకృతి ఇచ్చే సుఖాన్ని, దుఃఖాన్ని, జననాన్ని, మరణాన్ని ఒకే దైవిక లీలలో భాగంగా స్వీకరిస్తాడు.
ప్రకృతిలో సంహారతత్త్వం ఉంది, దాన్ని మనం మార్చలేం. కానీ, దాన్ని అర్థం చేసుకునే మన దృక్పథాన్ని మార్చుకోగలం. దైవత్వం అంటే ఒక్క సౌమ్యత మాత్రమే కాదు, ఘోరమైన తత్త్వమూ దానిలోనే ఉంది అని గుర్తించడమే నిజమైన ఆధ్యాత్మిక వికాసం. కాళీ తత్త్వాన్ని అర్థం చేసుకోవడం అంటే జీవితంలోని కఠిన సత్యాలను, మార్పును, మరణాన్ని భయం లేకుండా స్వీకరించే మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవడమే. భయాన్ని దాటి, ద్వంద్వాలను అధిగమించి, ఆ విశ్వశక్తి సృష్టి ధర్మానికి ప్రణమిల్లడమే కాళీ ఉపాసన పరమార్థం.