Kaushik Reddy : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. కొడంగల్ స్థానానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని, హుజూరాబాద్‌లో తాను కూడా రాజీనామా చేస్తానని, ఇద్దరం ఉప ఎన్నికల బరిలో దిగుతామని అన్నారు. ఆ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి డిపాజిట్ తెచ్చుకుంటే సభ సాక్షిగా ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేశారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన.. శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగించిన భాష, పదజాలం అసహ్యకరంగా ఉన్నాయని మండిపడ్డారు. తెలంగాణ సమాజమంతా ఈ అభ్యంతరకర వైఖరిని గమనిస్తోందని చెప్పారు. సభలో ప్రతిపక్ష సభ్యులను గౌరవించకుండా సీఎం ఇష్టానుసారంగా మాట్లాడారని కౌశిక్ రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోనే ‘కత్తులతో నరుకుతాం’ అని బహిరంగంగా బెదిరింపులకు దిగారని కౌశిక్ రెడ్డి అన్నారు. ఇవన్నీ పక్కనబెట్టి తమపై ఎథిక్స్ కమిటీ పేరుతో చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై కడియం శ్రీహరి చేస్తున్న విమర్శలకు కౌశిక్ రెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు.
కోట్లాది రూపాయల నిధుల వినియోగంతోపాటు బీఆర్ఎస్ పార్టీ బీ-ఫారమ్‌పై గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వ్యక్తి కడియం శ్రీహరి అని మండిపడ్డారు. డిప్యూటీ సీఎంగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా పదవులు అనుభవించినప్పుడు ఆయనకు లేని నైతిక విలువలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా..? అని నిలదీశారు. స్వార్థ రాజకీయం కోసం తల్లిలాంటి పార్టీని వీడిన నేతలు తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు.